సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు... | Sakshi
Sakshi News home page

సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు...

Published Wed, Apr 19 2017 8:27 AM

సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు... - Sakshi

నిండా మూడు పదులు నిండకుండానే వందల కోట్ల ఆస్తులకు కూడగట్టాటంటే అతని నేరసామ్రాజ్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈసీకి టీటీవీ దినకరన్‌ లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన ‘బ్రోకర్‌’ సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు. అతని నేర జీవితం మొగ్గతొడిగింది బెంగళూరులోనే. చంద్రప్ప లేఔట్‌లో పుట్టిపెరిగిన ఇతనిపై పలు పీఎస్‌లలో పదులసంఖ్యలో చీటింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

సాక్షి, బెంగళూరు: పార్టీ రెండు ఆకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు కోట్ల రూపాయల్లో లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్‌ అయిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ నేర ప్రవృత్తికి పునాది పడింది బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచే అక్రమాల బాట పట్టిన ఇతడు 19 ఏళ్ల వయస్సులోనే మొదటిసారిగా శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళ్లడం గమనార్హం. అన్నా డీఎంకే పార్టీ చిహ్నమైన రెండు ఆకుల గుర్తును తమకే కేటాయించడానికి శశికళ వర్గం ప్రముఖుడు టీటీవి దినకరన్‌... సుకేశ్‌ ద్వారా లంచం ఇవ్వజూపారని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం తెలిసిందే. సుకేష్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం ఢిల్లీలో అరెస్టు చేయడం విదితమే.

పెద్ద పెద్దవాళ్ల పేర్లతో బుట్టలోకి
బెంగళూరు నగరంలోని చంద్రప్ప లేఔట్‌కు చెందిన సుకేష్‌ 19 ఏళ్ల ప్రాయంలోనే చీటింగ్‌ కేసులో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తరువాత మోసాల్లో ముదిరిపోయాడు. ముఖ్యమంత్రులు, ఎంపీలకు తాను ఆప్తుడినంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ అమాయకులను బుట్టలోకి వేసుకునేవాడు. 2011లో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన ఒక సంస్థ ఎండీ పొన్నుదురైతో పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలో బడి పిల్లలకు రూ.5లక్షల విలువ చేసే ఖర్జూరాలను కొనాలని చెప్పాడు. ఈ కాంట్రాక్ట్‌ ఇవ్వాలంటే తనకు కమీషన్‌ ముట్టజెప్పాలని సూచించాడు. ఇది నమ్మిన పొన్నుదురై రూ.80వేలను సుకేశ్‌ ఖాతాలో జమ చేశాడు.

కొద్దిరోజుల తరువాత మరో రూ.2లక్షల చెల్లించాలంటూ పొన్నుదురైకి సూచించాడు. అయితే ఈసారి కొంచెం జాగ్రత్త వహించిన పొన్నుదురై ప్రభుత్వ లెటర్‌హెడ్‌పై వివరాలను అందించాలంటూ తెలిపారు. దీంతో తప్పించుకు తిరగసాగాడు. ఇతని మోసంపై పొన్నుదురై అప్పటి బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ జ్యోతిప్రకాశ్‌ మిర్జీకి ఫిర్యాదు చేశాడు. విధానసౌధ పోలీసులు ఆ కేసును సీసీబీకి బదిలీ చేశారు. దీంతో సీసీబీ సుకేశ్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా, మరిన్ని నేరాలు వెలుగుచూశాయి. కొన్నిరోజుల తర్వాత ఈ కేసులో బెయిల్‌ పై విడుదలై బయటికి వచ్చాడు.


నటి లీనాపాల్‌తో కలిసి చీటింగ్‌లు
సుకేశ్‌ కన్నడ వర్ధమాన నటి లీనా పాల్‌తో స్నేహం చేశాడు. ఆ స్నేహం సహజీవనం వరకూ వెళ్లింది. ఇద్దరూ కలిసి చెన్నై, ముంబయి వ్యాపారవేత్తలను కోట్ల రూపాయలకు మోసగించినట్లు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఇద్దరూ బెంగళూరు వద్ద ఒక ఫాంహౌస్‌లో ఉండగా చెన్నై పోలీసులు అరెస్టుచేశారు. ఫాంహౌస్‌లో అత్యంత ఖరీదైన మెర్సిడెస్‌ కార్లు దొరికాయి. ఇదేరీతిలో జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ తనకు మంచి స్నేహితుడని వ్యాపారవేత్తలను నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా యడ్యూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అనేక మంది వ్యాపారవేత్తలను మోసం చేసినట్లు ఫిర్యాదులున్నాయి.

సామాన్యులనూ వదల్లేదు
అంతేకాకుండా బీడీఏలో పనులు పూర్తి చేయిస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నగరవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2013లో ఫేస్‌బుక్‌ ద్వారా కన్నడ చిత్ర నటీమణులను పరిచయం చేసుకొని పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు కూడా ఫిర్యాదులున్నాయి. రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం... సుకేశ్‌పై 100కు పైగా మోసానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందగా 25 నుంచి 30 వరకు కేసులు నమోదయ్యినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అతని సమాచారం కోసం బెంగళూరుకు రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement