డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు..
నెక్సియం జెనరిక్ అమ్మకాలపై
అమెరికా కోర్టు తాత్కాలిక నిషేధం
3 రోజుల్లో రూ. 1,000 నష్టపోయిన షేరు ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూఎస్‌ఎఫ్‌డీఏ ఇచ్చిన వార్నింగ్ లేఖలతో సతమతమవుతున్న కంపెనీకి తాజాగా అమెరికా కోర్టు రూపంలో మరో సమస్య వచ్చి పడింది. అమెరికా మార్కెట్లో నెక్సియమ్ ట్యాబ్లెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. డాక్టర్ రెడ్డీస్ విక్రయిస్తున్న జెనరిక్ వెర్షన్‌లో ఊదా రంగు (పర్పుల్) వినియోగించడంపై ప్రత్యర్థి ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ జరిపే వరకు అమ్మకాలను నిషేధిస్తూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ డెలవారే ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది.
ఉదారంగు ట్యాబ్లెట్స్ అంటేనే నెగ్జియమ్ అని డాక్టర్లు, రోగులు గుర్తుపట్టే విధంగా తాము ప్రచారం చేశామని, ఇందుకోసం 250 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు ఆస్ట్రాజెనికా చెపుతోంది. ఈ ట్యాబ్లెట్ల విక్రయాలను నిషేధం విధిస్తే డాక్టర్ రెడ్డీస్ 30-50 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నష్టపోతుందని అంచనా వేస్తున్నట్లు ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది. ఈ మేరకు ఈపీఎస్ రూ. 1-2 తగ్గుతుంది. ఈ వార్తల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా డాక్టర్ రెడ్డీస్ షేరు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. నవంబర్ 6న నమోదైన గరిష్ట స్థాయి రూ. 4,292తో పోలిస్తే ఇప్పటి వరకు ఈ షేరు రూ. 962 (23%) నష్టపోయింది. మంగళవారం ఒక్కరోజే 5 శాతం నష్టపోయి రూ. 3331 వద్ద ముగిసింది.