Interim Budget 2024
-
‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్లో రగడ
న్యూఢిల్లీ: బడ్జెట్లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, ఇది భారత రాజ్యాంగంపై దాడేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామని ఎన్నికల్లో గెలవగానే ఎంపీలతో ప్రమాణం చేయించాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనను కాంగ్రెస్ కోరుతోందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కాని వ్యక్తి వ్యాఖ్యలపై సభలో చర్చ ఎందుకని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. విభజన ఆలోచనను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని అన్నారు. డీకే అనుచితంగా మాట్లాడినట్లు తేలితే సభా హక్కుల కమిటీ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా ఆదరణ ఉందంటూ ఎన్నికలను శాశ్వతంగా రద్దు చేయడం ఖాయమంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ సభ్యుల వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చించవచ్చని గతంలోనే ఆదేశాలిచ్చానని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్‌ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్లో అనాసక్తి -
Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ.47,65,768 కోట్లు పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు 2024-25లో రూపాయి రాక(శాతాల్లో) కార్పొరేషన్ పన్ను: 17 ఆదాయ పన్ను: 19 కస్టమ్స్ పన్ను: 4 కేంద్ర ఎక్పైజ్ పన్ను: 5 జీఎస్టీ, ఇతర పన్నులు: 19 పన్నేతర ఆదాయం: 7 రుణేతర మూలధన సేకరణ: 1 మార్కెట్ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28 రూపాయి పోక(శాతాల్లో) కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16 రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20 రక్షణ రంగ వ్యయం: 8 సబ్సిడీలు: 6 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయింపులు: 8 పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20 పెన్షన్ల చెల్లింపులు: 4 ఇతర ఖర్చులు: 10 కేంద్రపాయోజిత పథకాలు: 8 ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి -
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
Interim Budget 2024: ప్చ్..నచ్చలే! సెన్సెక్స్ నష్టం 107 పాయింట్లు
ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఒడిదుడుకులు... సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది. ► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది. ► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్సీటీసీ 1.50%, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి. ► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది – యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్‌ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’ – బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి -
డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్... రూ. 50,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది. అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదీ తీరు.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది. -
ఆశలు.. అంచనాలే
సాక్షి, హైదరాబాద్: కేటాయింపుల్లో స్పష్టత ఉండని కేంద్ర ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్రానికి ఆశలు, అంచనాలనే మిగిల్చింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గురువారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. కేవలం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని తలపెట్టిన పలు ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారానే రాష్ట్ర ప్రజానీకం కూడా లబ్ధి పొందనున్నారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లాంటి అంశాలు ప్రస్తావనకు రాలేదు. అయితే దేశ వ్యాప్తంగా అమలు చేయనున్న కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు లబ్ధి కలుగుతుందని, ప్రతిపాదించిన నిధుల్లో తెలంగాణకు ఎంత కేటాయిస్తారన్న దానిపై స్పష్టత వస్తేనే ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాల లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. ఇళ్ల నుంచి సౌర విద్యుత్ వరకు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన స్టార్టప్‌లు, ఆయుష్మాన్ భారత్, గృహ నిర్మాణం, ఉపాధి హామీ నిధుల పెంపు, మెట్రో రైళ్లు, 300 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచితంగా సోలార్ పవర్ ప్యానెళ్లు లాంటి పథకాలు తెలంగాణకు ఉపయుక్తం కానున్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌ల అభివృద్ధిలో దేశంలోనే టాప్ స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. ఒక్క హైదరాబాద్ వేదికగానే 3,500 నుంచి 4,000 స్టార్టప్‌లున్నాయని అంచనా. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టార్టప్‌ల ఏర్పాటులో తెలంగాణ నాలుగు శాతం అదనపు వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో స్టార్టప్‌ల కోసం కేటాయించిన రూ.43 వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్‌లో స్టార్టప్‌ల ఏర్పాటుకు మరింత ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త నగరాల్లో మెట్రో రైళ్లను విస్తరిస్తామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు వందేభారత్ రైళ్ల తరహాలో సాధారణ రైలు బోగీల అభివృద్ధి, రైల్ కారిడార్ల ఏర్పాటు కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, కొత్త లైన్ల నిర్మాణానికి నిధులు దక్కే అవకాశాలున్నాయి. ఈసారి దేశ వ్యాప్తంగా 2 కోట్ల మందికి కొత్త గృహాలు నిర్మించే ప్రతిపాదనలను చేసిన నేపథ్యంలో మన రాష్ట్రానికి 6–8 లక్షల గృహాల నిర్మాణానికి ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే విధంగా 300 యూనిట్ల వరకు విద్యుత్ కోసం గృహాలకు ఉచితంగా సోలార్‌పవర్ ప్యానెళ్లు అందజేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ఉచిత ప్యానెళ్ల వల్ల కూడా లక్షలాది మంది గృహ వినియోగదారులకు ఊరట కలగనుంది. ఇక రాష్ట్రంలో 61 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. ఈసారి బడ్జెట్లో కేంద్రం గత ఏడాది కంటే ఉపాధి నిధులను పెంచింది. దీంతో వచ్చే ఏడాదిలో కార్డుల సంఖ్యతో పాటు ఉపాధి హామీ వేతనం కూడా పెరిగే అవకాశాలున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచాన వేస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా సిబ్బందిని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకురానుండడంతో రాష్ట్రంలోని 35వేల మంది అంగన్వాడీ టీచర్లు, మరో 35 వేల మంది హెల్పర్లతో పాటు 25 వేల మంది ఆశా వర్కర్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభించనుంది. కేటాయింపులు తేలాలి జాతీయ రహదారులు, స్టార్టప్‌ల కార్పస్ ఫండ్ పేరిట కేటాయించిన నిధుల వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరుతుందనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే కానీ తేలదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. హైవేల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైవేల నిమిత్తం 1,200 కిలోమీటర్ల కొత్త ప్రతిపాదనలున్నాయి. అయితే రాష్ట్రంలోని ఏ రహదారికి ఎంత కేటాయిస్తారనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే తేలనుంది. స్టార్టప్‌ల కార్పస్ ఫండ్ కింద కేంద్రం రూ.లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలను అందజేస్తామని ప్రకటించింది. ఈ ఫండ్‌ను ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారనే లెక్కలు తేలితేనే మన రాష్ట్రంలోని ఎంత మంది యువత ఈ రుణాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందుతారో తేలనుంది. మనదీ ఓటాన్ అకౌంటేనా? కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్‌కు వెళతారా అన్న దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. గ్రాంట్ ఇన్ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటాతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్లో ప్రజలపై వి«ధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెపె్టంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. స్కూళ్లకు నిధులు యూజీసీకి 60 శాతం కోత న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో గ్రాంట్లను 60.99 శాతం మేర కోత వేసింది. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రూ.6,409 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం 2,500 కోట్లు కేటాయించింది. అయితే, 2024–25 బడ్జెట్లో స్కూళ్లకు కేటాయింపులు పెంచింది. పాఠశాల విద్యకు గత ఏడాది సవరించిన అంచనాల (రూ.72473.80) కన్నా దాదాపు రూ.500 కోట్ల మేర పెంచి 73008.10 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యకు మాత్రం గత ఏడాది రూ.57244.48 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,600 కోట్లు కోతవేసి 47619.77 కోట్లు కేటాయించడం గమనార్హం. కేంద్రం ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కోత విధించింది. గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.608.23 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే, ఐఐటీలకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.10384.21 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.10324.50 కోట్లు కేటాయించారు. అలాగే, కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులను 28 శాతం పెంచారు. వీటికి గత ఏడాది రూ.12000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.15472 కోట్లు కేటాయించడం విశేషం. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లను రూ.8,200 కోట్ల మేర పెంచగా, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల మేర పెంచారు. 390 వర్సిటీలు... 3000 ఐటీఐలు 2014 నుంచి ఇప్పటివరకు పదేళ్లలో పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థలను నెలకొలి్పనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్ విద్యాసంస్థలను, 390 యూనివర్సిటీలను ఏర్పాటుచేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే, 3,000 ఐటీఐలను కూడా స్థాపించామన్నారు. యువతను ఎంతవరకు సాధికారికంగా మార్చామన్నదానిపై మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. సంస్కరణలకు జాతీయ విద్యావిధానం–2020 నాంది పలుకుతోందని, ‘పీఎం శ్రీ’పథకం ద్వారా నాణ్యమైన బోధనను అందించడంతోపాటు విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద మూడువేల ఐటీఐలను ఏర్పాటుచేసి ఇప్పటివరకు 1.4 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, 54 లక్షల మంది యువకుల ప్రతిభకు మెరుగులు దిద్దామని తెలిపారు. బడ్జెట్.. ఆశలు.. మధ్యంతరమే! ♦ ‘ఓటాన్ అకౌంట్’ కావడంతో ఎలాంటి మార్పులకూ వెళ్లని ఎన్డీయే సర్కారు ♦ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని భావించిన ఉద్యోగులు ♦ కొత్త పథకాలపై ఆశలు పెట్టుకున్న పలు వర్గాలు ♦ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రకటించవచ్చనే అంచనాలు ♦ కానీ చిన్న చిన్న మినహాయింపులకేపరిమితమైన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యమంటూ మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. అన్ని వర్గాల ఆశలను మధ్యంతరంగానే వదిలేసింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని, కొత్త పథకాలు ప్రకటించవచ్చని, పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టవచ్చని ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పన్నులు సహా ఇతర అంశాలు వేటిలోనూ పెద్దగా మార్పులూ చేయలేదు. వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆశ పెట్టుకున్న పన్ను మినహాయింపులు, శ్లాబ్ రేట్ల మార్పు వంటివాటి జోలికి వెళ్లలేదు. ఎలాంటి ఉపశమనం కలి్పంచలేదు. కొత్తగా భారమూ వేయలేదు. ఆర్థిక వృద్ధి, సంస్కరణలపై ఫోకస్.. కొత్త సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రస్తావన పెద్దగా తీసుకురాని కేంద్ర ఆర్థిక మంత్రి.. తన ప్రసంగం పొడవునా ఆర్థిక వృద్ధి దిశగా చేపట్టే చర్యలనే ఎక్కువగా వివరించారు. గత పదేళ్ల పాలనకు సంబంధించి కూడా పన్నుల ఆదాయంలో వృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్థికవృద్ధి మరింత వేగం పుంజుకునేలా మూలధన వ్యయానికి రూ.11.1 లక్షల కోట్లను కేటాయించామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి అనూహ్య స్థాయిలో వేగం పుంజుకుంటుందని.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు.. భవిష్యత్తులో ద్రవ్యలోటును తగ్గించడంతోపాటు అప్పులు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తూ వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఎన్డీయే పాలనతో ప్రజలు సంతృప్తితో ఉండటంతోనే రెండోసారి భారీ మెజార్టీ ఇచ్చారని.. ఇప్పుడు మూడోసారి గెలిస్తే సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి దిశగా శరవేగంగా చర్యలు చేపడతామని ప్రకటించడం విశేషం. సబ్సిడీలకు కోత వేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్న ఎన్డీయే సర్కారు.. దాన్ని ప్రస్తుత బడ్జెట్లోనూ కొనసాగించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులను 8శాతం మేర తగ్గించారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మాత్రం కోత పెట్టలేదు.మరోవైపు మధ్యతరగతి వారి సొంతింటికలను తీర్చేందుకు కొత్తగా పథకాన్ని తెస్తామని ప్రకటించి కాస్త ఊరటనిచ్చారు. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల అందుబాటు ధరల గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా.. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి కేటాయింపులను 11 శాతం పెంచారు. విమానయానాన్ని మరింత ప్రోత్సహించేలా టైర్–2, 3 స్థాయి నగరాలకూ కొత్తగా విమాన సరీ్వసులతోపాటు ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేను మరింత మెరుగుపర్చే దిశగా.. 40వేలకుపైగా బోగీల్లో ‘వందే భారత్’ప్రమాణాల స్థాయిలో సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు. దీనితోపాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు రూ.1.3లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇస్తామని ప్రతిపాదించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు ప్రకటించారు. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
అభివృద్ధి నినాదంతో బడ్జెట్: నిర్మలా సీతారామన్
-
అభివృద్ధి నినాదం.. బడ్జెట్ విధానం: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదని అన్నారు. వరుసగా మూడేళ్లుగా 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నుంచి దేశాన్ని రక్షించామని స్పష్టం చేశారు. బడ్జెట్లో నాలుగు విషయాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, యువత, మహిళలు అభివృద్ధి కేంద్రంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. ద్రవ్యలోటును 4.5కు తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సరైన విధానాలు, నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. జీడీపీ ఏం సాధించామో స్పష్టంగా చెప్పామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాలనలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. మూడు రైల్వే కారిడార్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మెట్రో, నమో భారత్ కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల జీవణ ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Interim Budget 2024: లక్షద్వీప్‌కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్‌లను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్‌లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ను కేటాయించారు. సహజమైన బీచ్‌లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
Interim Budget 2024: నేడే బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈరోజే పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మెరుపులు ఉంటాయా ? అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్నెస్ అలవెన్స్‌ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయుశ్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. -
Budget 2024: ఉమెన్ పవర్‌కు ఊతం ఇచ్చేలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి. వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు? మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల అభిప్రాయాలు... ప్రత్యేక నిధి గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి. –స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో మహిళా శ్రేయస్సు మహిళల హెల్త్‌కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. – రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద గేమ్ చేంజర్‌గా... మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్‌చేంజర్‌గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి. – సోమ్దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్ మరిన్ని పొదుపు పథకాలు గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్‌కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా... పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. – జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో బాలికల విద్యకు ప్రాధాన్యత రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్‌ను పెంచాలి. – రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కోల్‌కతా చాప్టర్)– చైర్పర్సన్ మహిళా రైతుల కోసం... బడ్జెట్లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి. – ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. – నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్ -
Budget 2024: రేపే మధ్యంతర బడ్జెట్
దిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. -
Budget 2024: అప్పట్లో ఇవే హైలెట్స్.. మళ్లీ ఉంటాయా?
బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి.. ➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. ➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు. ➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ➧ విద్య: విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మళ్లీ ఉంటాయా? సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
Budget 2024-25: మహిళాసాధికారతకు ప్రధాన డిమాండ్లు
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ, భాగస్వామ్యం ఆశించినమేరకు లేదనేది వాస్తవం. ఉదాహరణకు కంపెనీల్లో అత్యున్నతస్థానంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ సదరు సంస్థల్లో వారి సంఖ్య పెరగడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు సంస్థలు, ఇతర రంగాలు మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. వీటిని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. రానున్న బడ్జెట్లో వారి అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లో భాగంగా పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసే నగదుపై లభించే వడ్డీను పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని కొందరు కోరుతున్నారు. ప్రసుత్తం 7.5శాతం వడ్డీ అందిస్తున్నారు. దీన్ని మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే కొందరు భావిస్తున్నారు. మహిళల సాధికారత కోసం సంప్రదాయ వ్యవహారాలకు భిన్నంగా వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించేలా చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి బడ్జెట్లో నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నారు. 15-50 సంవత్సరాల వయసు ఉన్న మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దాంతో చాలామంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. రానున్న బడ్జెట్లో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఒంటరి మహిళల భద్రత, వారికి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేలా నిర్ణయాలు ఉండాలని కొందరు భావిస్తున్నారు. నిర్భయ ఫండ్ అనేది మహిళల భద్రత కోసం 2013లో స్థాపించిన నాన్ లాప్సబుల్ కార్పస్ ఫండ్. డిసెంబర్ 2023లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 70 శాతం నిధులు మాత్రమే అంటే రూ.7,212 కోట్లలో రూ.5,119 కోట్లు పథకం ప్రారంభం నుంచి వినియోగించారు. నేరాలు జరుగుతున్నా వాటిని అరికట్టేలా చర్యలు ఉండడం లేదు. ఈసారి బడ్జెట్లో మరింత నిధులు పెంచి వాటిని సమర్థ్యంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతున్నా వారు తక్కువ జీతం, తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలను చేపడుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. -
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏమన్నారంటే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మాట్లాడారు. కొత్త పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేయడం రాష్ట్రపతికి ఇది తొలిసారి కావడం విశేషం. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. రూ.7 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఇటీవల కాలంలో భారీగా పెరిగారు. దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్, ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ నినాదంతో అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం ఇండియా. ప్రభుత్వం దేశ్యవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆదునికీకరించింది. భారీగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. -
పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పన్నుదారులకు ఊరట లభిస్తుందా..?
ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే పన్నుభారం అధికమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్నుదారులకు కొంత వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. దేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4-8 శాతంగా నమోదవుతోంది. దాంతో వస్తున్న సంపాదనలో గరిష్ఠంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా పన్ను చెల్లింపుదారులకు మరింత నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. అధిక జీతాలున్న వారికి పన్నుస్లాబ్లు పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల థ్రెషోల్డ్‌ను రూ.20 లక్షలకు పెంచడం వల్ల కొంత ద్రవ్యోల్బణంతో పాటు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2020 కింద కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా పన్నుస్లాబ్లు 5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వార్షికంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రూ.20లక్షల స్లాబ్‌కు మార్చాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నారు. ఏటా స్టాండర్డ్ డిడక్షన్‌లో భాగంగా ఉన్న రూ.50,000 స్లాబ్‌ను రూ.1లక్షకు పెంచాలని కొందరు కోరుతున్నారు. -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
పీఎం కిసాన్ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్
రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50 శాతం పెరగవచ్చని అంచనా. ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
కేంద్రబడ్జెట్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
బడ్జెట్ 2024-25ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో కీలకమైన కొన్ని బడ్జెట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. స్వాతంత్య్రం రాకముందే బడ్జెట్.. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను బ్రిటిష్ రాణికి సమర్పించారు. స్వతంత్ర భారత తొలి బడ్జెట్.. స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రులు.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు ప్రవేశపెట్టినవారు.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962-69 మధ్య 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాలల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమయం మార్పు.. 1999 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరిలో చివరి పనిదినాన, సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్పు చేసి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. బడ్జెట్ తేదీ మార్పు.. బడ్జెట్‌ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే, 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు. అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్లు.. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. ఆ బడ్జెట్లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. సుదీర్ఘ ప్రసంగం.. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది. బడ్జెట్ లీక్.. 1950 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ లీక్ అయ్యింది. లీక్ కారణంగా అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించే బడ్జెట్‌ను, దిల్లీలోని మింట్‌రోడ్‌కు మార్చారు. 1980లో నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. 1995 వరకు బడ్జెట్‌ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ సిద్ధం చేయించింది. పేపర్‌లెస్ బడ్జెట్.. 2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారిగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పేపర్‌లెస్ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్ విలీనం.. 2017కు ముందు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ రెండింటిని విలీనం చేశారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..! బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళలు.. ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది. -
బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా.. ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద ద్రుష్టి సారించే అవకాశం ఉందని వెల్లడించారు. 👉2024 బడ్జెట్లో డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి. 👉ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 👉కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి & వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. 👉రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 👉వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది. 👉గృహాల కోసం ప్రభుత్వం డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.