సాక్షి, మహబూబ్ నగర్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయంగా కోపం ఉంటే నాపై చూసుకోండి కానీ.. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే అలాంటి వాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కురుమూర్తి స్వామి దయ వల్లే తాను సీఎం అయ్యానని రేవంత్ చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తి స్వామి దయే. తిరుపతి వెళ్లటానికి వీలులేని వాళ్లు కురుమూర్తి స్వామిని దర్శించుకుని తరించే గొప్ప క్షేత్రం. ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవు. 900 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి, ఘాట్ రోడ్డుకు 110 కోట్లు మంజూరు చేశాను. ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తాం. మన్యంకొండ, కురుమూర్తి ఆలయాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్దం చేసి పంపించండి.
తెలంగాణలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలో ఇక్కడికి పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. ఇక్కడ ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో పచ్చని పంటలు పండాలి. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఈ ప్రాంతం ఇచ్చింది. పాలమూరు రుణం తీర్చుకుంటాం.
కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభిస్తాం. ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేస్తుంటే కొందరు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయంగా కోపం ఉంటే నాపై చూసుకోండి కానీ.. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే అలాంటి వాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారు. వెనుకబడిన జిల్లా సంపూర్ణ అభివృద్ధికి బాధ్యత నాది. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రెండు వేల మంది స్థానిక యువకులకు అమర రాజా పరిశ్రమలలో ఉద్యోగులు కల్పించాలని యాజమాన్యానికి సూచించాం అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment