lingamaneni estate
-
కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నోటీసులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసాన్ని ఈ రోజు (సోమవారం) కూల్చేస్తున్నామంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు పాతురి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ కట్టడాలు తొలగించామని తెలిపారు. చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడమేనని, చంద్రబాబు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారని బొత్స గుర్తు చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా ఆ రోజు ఈ భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు అంగీకరించారని, కానీ, ఇప్పుడేమో దానిపై మాట మారుస్తున్నారని బొత్స తప్పుబట్టారు. లింగమనేని నివాసానికి కూడా నోటీసులు ఇచ్చామని, చట్టప్రకారం అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తామని బొత్స తేల్చిచెప్పారు. సీఆర్డీఏ పరధిలోని అన్ని అక్రమ కట్టడాలు తొలగిస్తామని ఆయన తెలిపారు. -
బాబు ఇంటిని కూల్చేస్తున్నారని..
సాక్షి, అమరావతి: ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబునాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా విషప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. దీనిలోభాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటిని కూల్చేస్తున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రారంభమైన అక్రమ నిర్మాణాల తొలగింపు ఉండవల్లి కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇప్పటికే పలుమార్లు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. -
యనమల చెప్పేదేమైనా భగవద్గీతా..
సాక్షి, విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యనమల, లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స సత్యనారాయణ..యనమల చెప్పేదేమైనా..భగవద్గీతా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమంగా కట్టారని, అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని తెలిపారు. అది మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటేనన్నారు. తాము ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడటం లేదని బొత్స ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ లోకేష్, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయంటూ బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు విద్యుత్ కోనుగోళ్ల ఎంఓయూలతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. బాబు హయాంలో ఎప్పుడూ దోచేద్దామా అన్నట్టుగా పాలన చేశారంటూ గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విద్యుత్ రేట్లు పెంచిన బాబు ఐదేళ్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తిని పెంచారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష, ద్వేషం లేదని, అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన సిద్ధించడం కోసమే చర్యలు తీసుకుంటున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఆ ఇంటిని చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలి!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ ఒక అక్రమ నిర్మాణమని, కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ నివాసం నుంచి చంద్రబాబునాయుడు తక్షణం ఖాళీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగమనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు’ అని ఆయన ట్విటర్లో స్పష్టం చేశారు. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరమేంది? ‘కరకట్ట నివాసం అక్రమ నిర్మాణమని చంద్రబాబుకు ముందే తెలిసినా అమాయకత్వం నటిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ ఇంటికి అద్దె చెల్లించింది. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? 'చెయ్యను పో' అంటే ఇన్సైడర్ ట్రేడింగులో భాగంగానే లింగమనేని దాన్ని రాసిచ్చినట్టు అనుకోవాలి’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేవినేని ఉమ ఉత్తర కుమారుడు.. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుపై విజయసాయిరెడ్డి ట్విటర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిర పడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది. కాస్త ఓపిక పట్టు..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)
⇒‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు.. ⇒ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా.. ⇒ 300 ఎకరాల కబ్జా భూములు.. ⇒వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే... ⇒సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు ⇒ కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు ఎవరీ లింగమనేని?... జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి కట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది... రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే. ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో.. లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది. పేదల వద్ద పక్కా ఆధారాలు... లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు. సర్వే నెంబరు 191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది. -
రెయిన్‌ట్రీ తో అద్దె బేరాలు పూర్తి
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కే చెందిన రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు అపార్టుమెంట్లను, విల్లాలను మూడేళ్ల పాటు అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యంతో సంప్రదింపులను చేశారు. ఆ సంస్థ యాజమాన్యం ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. వాటికి సీఎం ఆమోదమే తరువాయి. రెయిన్ ట్రీ పార్కులోని అపార్టుమెంట్లలో 500 ఫ్లాట్లు, 100 విల్లాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్లాట్లను అఖిల భారత సర్వీసు అధికారుల కోసం, 100 విల్లాలను మంత్రులు, ఎమ్మెల్యేల కోసం అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. తాత్కాలిక సచివాలయం ఎక్కడో ఇంకా చెప్పకుండా రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యానికి ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నూతన రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అద్దెలు ఎక్కువగా ఉండటంతో అధికారులు అద్దె నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ముఖ్యమంత్రి దీనికి అంగీకరించలేదు. ఫ్లాట్లు, విల్లాలకు రూ. 12 వేలు, 30 వేలు అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దెలు ఏటా 7 శాతం పెరుగుతాయి. 2 నెలల అద్దె అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్లలో ఉండేవారు పలు నిర్వహణ చార్జీలు చెల్లించాలని, అవి ఎప్పటికప్పుడు మారుతాయని రెయిన్ ట్రీ యాజమాన్యం పేర్కొంది. అయితే నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇంకా ఖరారు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మరో పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలను మాత్రం నిర్ధారించింది. సదుపాయాల కోసం ఫ్లాట్లలో ఉండేవారు చెల్లించాల్సిన బిల్లులపై ఆ సంస్థ ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. నెలకు జిమ్‌కు రూ. 500, స్విమ్మింగ్ పూల్‌కు రూ. 600, గేమ్స్‌కు రూ. 500 చొప్పున చెల్లించాలి అద్దె చెల్లించేందుకు వీలుగా ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరవాలి. అద్దె అగ్రిమెంట్‌కు స్టాంపు డ్యూటీ 0.4 శాతం చెల్లించాల్సి ఉంది. దీన్ని మినహాయింపు ఇవ్వాలి. నిర్వహణ చార్జీలు కింద నెలకు చదరపు అడుగుకు రూపాయిన్నర చొప్పున అద్దెకు ఉండేవారు చెల్లించాలి. విద్యుత్ చార్జీలను, నీటి చార్జీలను అద్దెకు ఉండేవారు నెల నెలా చెల్లించాలి. -
సీఎం అతిథిగృహం సమీపంలో మంటలు
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి-ఉండవల్లి కరకట్టపై సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. లంకభూముల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథి గృహం లింగమనేని ఎస్టేట్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక వాహనం లంక భూముల్లోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో అధికారులు మంటలను ఆర్పడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అతిథి గృహం వైపు వెళ్లే రోడ్డు మార్గం కూడా నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా మూసేశారు. దీంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. -
ముఖ్యమంత్రి 'అక్రమ' నివాసం!
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజు తలచుకుంటే ఎలాంటి అక్రమమైనా నిమిషాల్లో సక్రమమైపోతుందనడానికి రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి ఎంపిక చేసిన భవనమే నిదర్శనం. అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని లింగమనేని ఎస్టేట్స్‌కు కొద్దిరోజుల క్రితం నోటీసు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే లింగమనేని గ్రూపునకు రెడ్ కార్పెట్ పరిచింది. అక్రమ భవనాన్నే అనధికారికంగా సీఎం నివాసానికి లీజుకు తీసుకుంది. అందులో మరమ్మతులు, సౌకర్యాలకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. భవనాన్ని ఇచ్చిన లింగమనేని గ్రూపునకు నజరానాగా నాగార్జున యూనివర్సిటీ ఎదుట వారికే చెందిన రెయిన్ ట్రీ పార్కులో ఖాళీగా ఉన్న 500 ఫ్లాట్లను అధికారుల నివాసం కోసం అద్దెకు తీసుకొని భారీగా లబ్ది చేకూర్చనుంది. ఒక్కో ఫ్లాటుకు నెలకు రూ.40 వేలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి ఇటీవల రాజధాని ప్రాంతంలో ఖాళీ భవనాలను చూడడానికి వచ్చినప్పుడు కలెక్టర్ కాంతీలాల్ దండేతో కలిసి లింగమనేని రమేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత లింగమనేని ప్రతినిధులు రెయిన్‌ట్రీ పార్కులో తమ ప్లాట్లను అధికారుల నివాసానికి పరిశీలించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్‌కు ప్రజావాణిలో అధికారికంగా దరఖాస్తు చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని దీనికి ముందే సీఎం నివాసం కోసం గుంటూరు జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇందులోకి గృహప్రవేశం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఈ భవనంలోనే బస చేశారు. దీంతో ఈ భవనం అక్రమ కట్టడం అనే విషయాన్నే అధికారులు మరచిపోయి లింగమనేని గ్రూపునకు వంగివంగి సలాములు చేస్తున్నారు. నోరు మెదపని మంత్రి ఉమా కృష్ణా నదికి ఆనుకొని ఉన్న 272/2, 271 సర్వే నెంబర్లలో లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్‌కు 1.31 ఎకరాల భూమి ఉంది. 2007 మే 10న ఈ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారు. కానీ, స్విమ్మింగ్ పూల్ పేరుతో జీ+1 భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెండో అంతస్తు కూడా వేశారు. చాలాకాలం దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొంతకాలం కిందట ప్రకటించారు. ఆ తర్వాత జలవనరుల శాఖ సర్వే చేసి ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22 అక్రమ కట్టడాలున్నట్లు నిర్ధారించింది. ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్నాయి. నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ మార్చి 5న తేదీన తాడేపల్లి తహసీల్దార్ నోటీసులిచ్చారు. ఇంతలో ఏమైంతో తెలియదు కానీ ఇవన్నీ అక్రమ భవనాలంటూ రంకెలేసి విచారణకు అదేశించిన మంత్రి దేవినేని ఈ విషయం గురించే మాట్లాడడమే మానేశారు. రైతుల భూముల్లో రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల్లోనే ఒకదాంట్లో సీఎం నివాసం ఉంటుండడంతో నదీ పరిరక్షణ చట్టం తెల్లబోతోంది. ఏది అక్రమమని ప్రభుత్వం ప్రకటించిందో దాన్నే రూ.కోట్ల నిధులతో ఆధునికీకరించింది. ఇక్కడ ఎయిర్టెల్, వొడాఫోన్ మొబైల్ కంపెనీలు రెండు సెల్‌టవర్లను నిర్మించాయి. ఈ నివాసం కోసం రూ.3.30 కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భవనం వద్దకు వెళ్లడానికి లోటస్ ఫుడ్ సిటీ దగ్గరున్న పీడబ్ల్యూడీ వర్క్‌షాపు నుంచి 13 కిలోమీటర్ల కరకట్ట రోడ్డును ఆఘమేఘాల మీద నిర్మిస్తున్నారు. ఈ కరకట్ట రోడ్డు నిర్మాణానికి గతంలోనే రూ.111 కోట్లు మంజూరుకాగా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం సీఎం నివాసం కోసం ఈ నిధులతో రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. కరకట్ట మీద నుంచి సీఎం నివాసం లోపలికి వెళ్లే రోడ్డు పది అడుగులే ఉండడంతో దాన్ని 30 అడుగులకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు రైతుల భూములను భూసమీకరణ కింద ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారు. ఎలాంటి రాతపూర్వక పత్రాలు లేకుండానే వారి 12 సెంట్ల స్థలంలో రోడ్డు విస్తరించారు. సీఎం నివాసానికి ప్రత్యేకంగా డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. భవనం మరమ్మతులతో సహా వీటన్నింటికీ కలిపి వివిధ శాఖల ద్వారా రూ.20 కోట్లకు పైగానే ఖర్చు చేయిస్తున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడే నివాసం ఉండడం ద్వారా కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు లింగమనేని ఎస్టేట్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది. కానీ, నదీ పరిరక్షణ చట్టాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఉల్లంఘించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పేదల ఇళ్లు అక్రమం, సీఎం ఇల్లు సక్రమమా? 'కృష్ణానది పరిరక్షణ చట్టం పేరుతో కరకట్టకు ఆనుకొని ఉన్న పేదల ఇళ్లను తొలగించారు. పేదలకు వర్తించే చట్టం, నిబంధనలు సీఎం నివాసానికి వర్తించవా? ముఖ్యమంత్రి నివాసం సక్రమమైతే పేదల ఇళ్లు కూడా సక్రమమే. అక్కడ తొలగించిన నివాసాలను మళ్లీ నిర్మించాలి. సీఎం కోసం చట్టానికే తూట్లు పొడవడం అన్యాయం' - రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు -
చంద్రబాబు ఆ ఇంట్లో చేరడం న్యాయమా?
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఆయన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ రామకృష్ణ సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకే రాష్ట్రంలో లక్షల ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు చంద్రబాబు తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు శాపంగా మారిన 120 జీవో రద్దు చేయాలన్నారు. వివాదాస్పదంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు చేరడం న్యాయమా? అని రామకృష్ణ ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం అంతటి వ్యక్తే కృష్ణానది కరకట్టపై అక్రమ భవనాన్ని తన నివాసంగా మార్చుకుంటే ఇక అక్రమాలకు అడ్డు చెప్పేది ఎవరని, నదీ గర్భంలో అక్రమంగా భవనాలు నిర్మించారంటూ టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గగ్గోలు పెట్టారని, అక్రమ భవనాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని, తాను నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమమో, సక్రమమో సీఎం చెప్పాలన్నారు. రైతులు హాయిగా ఉన్నారంటూ చంద్రన్న రైతుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.