అచ్యుతాపురంసెజ్‌కు పారిశ్రామిక శోభ..  16వ తేదీన 16 పరిశ్రమలు | Sakshi
Sakshi News home page

అచ్యుతాపురంసెజ్‌కు పారిశ్రామిక శోభ..  16వ తేదీన 16 పరిశ్రమలు

Published Fri, Aug 12 2022 3:56 AM

atchutapuram sez industries - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ సర్కారు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అనేకం వస్తున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తోంది. అదే ఒరవడిలో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఈ నెల 16న మూడు భారీ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభంతోపాటు మరో 13 పరిశ్రమలకు భూమి పూజ జరగనుంది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీతో పాటు ఫార్మా, ఇథనాల్‌ యూనిట్లు ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏటీసీ టైర్ల యూనిట్‌ను 16న ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంలో మిగతా రెండు యూనిట్లలో ఉత్పత్తితోపాటు మిగతా పరిశ్రమల భూమిపూజకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏటీసీ టైర్స్‌ రూ.2,350 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ పరిశ్రమను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. సుమారు రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలిదశ యూనిట్‌ వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైంది.  

అలాగే రూ.60 కోట్లతో ఫార్మాసూటికల్,  రూ.84 కోట్లతో బయోఫ్యూయల్‌ ప్లాంట్‌ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు యూనిట్ల ద్వారా రూ.1,295.39 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడంతో పాటు 1,974 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇదే సెజ్‌లో ఏర్పాటవుతున్న వివిధ రంగాలకు చెందిన మరో 13 యూనిట్ల ద్వారా రూ.1,132.34 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. 3,686 మందికి ఉపాధి లభించనుంది. బల్క్‌ డ్రగ్స్, పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్, పారిశ్రామిక ఆక్సిజన్‌ తయారీ, ఫెర్రో అల్లాయిస్‌ వంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచ్యుతాపురంలో 1,900 ఎకరాల్లో ఏపీ సెజ్‌ పేరుతో ఈ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సెజ్‌లో 20కిపైగా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.5,000 కోట్లకు పైగా టర్నోవర్‌ జరుగుతోంది.
చదవండి: మార్పును పట్టుకుందాం..

 
Advertisement
 
Advertisement