సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 226.488 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే దానిలో కేవలం 1.35 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడింది. ఇది సరఫరా చేసిన మొత్తంలో కేవలం 0.6 శాతం మాత్రమే. దీనికే ‘చీకటి రాజ్యం’ అంటూ తాటికాయంత అక్షరాలతో పచ్చబ్యాచ్‌కు చెందిన క్షుద్రపత్రిక ఓ కథనాన్ని అచ్చేసింది.
రామోజీ మోస్తున్న చంద్రబాబు హయాంలో వారంలో రెండ్రోజులు పరిశ్రమలకు ‘పవర్‌హాలిడే’, గ్రామాల్లో పగలంతా విద్యుత్ కోతలు విధించిన సంగతి ఈనాడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని రామోజీకి తెలియకపోవడం ఆశ్చర్యకరం. స్థానిక పరిస్థితుల కారణంగా తలెత్తిన విద్యుత్ అంతరాయాలన్నిటినీ విద్యుత్ కోతలుగా చూపించాలనే ప్రయత్నంలో అసలు నిజాలకు రామోజీ పాతరేశారు. కానీ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను విద్యుత్ సంస్థలు వాస్తవాలతో సహా ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు..
ఉత్పత్తి, వాతావరణ ప్రభావం..
ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గ్రిడ్ డిమాండ్ దాదాపు గతేడాది ఇదే రోజు జరిగిన 200.595 మిలియన్ యూనిట్లు కంటే 25.893 మిలియన్ యూనిట్లు (12.91 శాతం) పెరిగింది. కానీ, ఈ డిమాండ్‌కు సరిపడా సరఫరాకు వనరులు అందుబాటులో లేవు. ఈ సీజన్‌లో అధికంగా ఉండాల్సిన పవన విద్యుత్ కూడా వాతావరణంలో మార్పులవల్ల అంచనా వేసిన దానిలో కేవలం 30 శాతం కూడా రావడంలేదు. రోజులో వివిధ సమయాల్లో ఒక్కోసారి అంచనాలో కేవలం 10 శాతం కూడా ఉత్పత్తి కావటంలేదు. అలాగే, ఈ ఏడాది కృష్ణా నది బేసిన్‌లో జల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
ఎగువ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఇంకా నీటి చేరిక మొదలుకాలేదు. దానివల్ల జల విద్యుదుత్పత్తి కూడా జరగడంలేదు. ఏపీ జెన్‌కోలోని కొన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు వార్షిక మరమ్మతుల నిర్వహణ కోసం ఆపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని కుడిగి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. హిందుజా థర్మల్ కేంద్రంలో బొగ్గు కొరతవల్ల రెండు 520 మెగావాట్ల జనరేటర్లలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తోంది.
మార్కెట్‌లో దొరకడంలేదు..
ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఏఏ సమయాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందో ఆయా సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్లాల్సి వస్తోంది. స్వల్పకాలిక మార్కెట్‌లో కూడా తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటంలేదు. ఎంత ధర వెచ్చించినా బహిరంగ మార్కెట్‌లో స్వల్పకాలిక కొనుగోళ్లు చేద్దామన్నా తగినంత విద్యుత్ అందుబాటులో లేదు.
మనం పెట్టే బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 10–20 శాతం మాత్రమే దొరుకుతుంది. అత్యంత అధిక ధర (సీలింగ్ ధర)కు బిడ్డింగ్ వేయడానికి సిద్ధపడినా కూడా తగినంత విద్యుత్ లభించడంలేదు. అయినప్పటికీ ఎలాగోలా ప్రయత్నించి బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.483 చొప్పున రూ.46.803 కోట్లతో 46.802 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను శనివారం కొనుగోలు చేశారు.
నిరంతర చర్యలు..
ఇక విద్యుత్ గ్రిడ్‌ను సమతుల్యం చేసే క్రమంలో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దేశీయ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రాయల్ విపరీతంగా పెరిగిపోయి మొత్తం గ్రిడ్ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉండడంతో దక్షిణ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అనివార్యంగా విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది.
దక్షిణ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఈనాడు, మరికొన్ని పత్రికల్లో రాస్తున్నట్లు మన రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో విద్యుత్ కోతలు, చీకటి రాజ్యం పరిస్థితులు లేవు. సామాన్య గృహ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తకూడదని ముందుగా పరిశ్రమలు వాడే విద్యుత్‌కు నియంత్రణ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు సూచనలిచ్చారు. మరోవైపు.. నిత్యం విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్ ఎక్స్చేంజీల్లోనే కాకుండా వారం ముందస్తు ద్వైపాక్షిక కొనుగోళ్ల ద్వారా కూడా విద్యుత్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment