న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి.
మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు..
► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్‌లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్‌లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి.
► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది.
ఆర్‌బీఐ అంచనాలు ఇలా...
2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్‌బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment