కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది! | Sakshi
Sakshi News home page

కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది!

Published Thu, Dec 14 2023 9:50 AM

Mohammed Aashiq Wins MasterChef India 2023 - Sakshi

బహుశా ‘మాస్టర్‌ చెఫ్‌‘ విజేతగా 25 లక్షలు ఇంటికి తీసుకొస్తాడు. అబ్బాయిలు వంట గదిలోకి వస్తే ‘ఏంట్రా ఆడపిల్లలాగా‘ అని మందలిస్తారు. కాని వంట స్త్రీలకూ, పురుషులకూ రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వారికి కొద్దో గొప్పో వంట తెలిసుండాలి. ‘మాస్టర్‌ చెఫ్‌’ తాజా విజేత ఆషిక్‌ మా అమ్మ నేర్పిన వంట వల్లే గెలిచాను అన్నాడు. మంగళూరులో చిన్న జ్యూస్‌ షాప్‌ నడుపుకునే ఆషిక్‌ ఇంత పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు.

‘సోనీ లివ్‌’ చానల్‌ వారి ప్రఖ్యాత రియాలిటీ షో ‘మాస్టర్‌ షెఫ్‌’ సీజన్‌ 8 ఆడిషన్స్‌ రౌండ్‌లో ఆషిక్‌ చేసిన మంగళూరు స్టయిల్‌ ఫిష్‌ ఫ్రైను జడ్జీలు వెంటనే ఓకే చేయలేదు. ‘కొంత బాగుంది కొంత బాగలేదు. మళ్లీ చెప్తాం’ అన్నారు. కాని ఆ తర్వాత ఆషిక్‌కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి అంటే అక్టోబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 8 ఫైనల్స్‌ వరకూ ఆషిక్‌ చేసిన వంటకాల ప్రయాణం ఉద్వేగభరితంగానే సాగింది. ఎందుకంటే అతడు వంటను శాస్త్రోక్తంగా నేర్చుకోలేదు. అమ్మ దగ్గర ఇంట్లో వంటగదిలో నేర్చుకున్నాడు.

24 ఏళ్ల కుర్రాడు
మంగళూరుకు చెందిన ఆషిక్‌ వయసు 24 ఏళ్లు. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇంటర్‌ తర్వాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేద్దామనుకున్నాడు. కాని ఫీజు కట్టే పరిస్థితి లేక కట్టలేదు. ఏం చేయాలి. వంట బాగా వచ్చు. యూ ట్యూబ్‌లో చూసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. దానికి కారణం చిన్నప్పటి నుంచి అతని ఆటలన్నీ వంట గదిలోనే సాగేవి. నానమ్మ వంట చేస్తుంటే అక్కడే కూచుని చెంబులు తప్పేళాలతో ఆడుకునేవాడు. అమ్మ హయాం వచ్చేసరికి వంటలో సాయం పట్టడం మొదలెట్టాడు.

తల్లి – ‘ఏమిటీ ఆడంగి పనులు’ అని తిట్టకుండా కొడుకును ప్రోత్సహించింది. ఇంటికి ఎవరొచ్చినా ఆషిక్‌ వంట చేసే పద్ధతి చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ ఆత్మవిశ్వాసంతో మంగళూరులో ‘కులుక్కి’ పేరుతో చిన్న జ్యూస్‌ షాప్‌ పెట్టాడు ఆషిక్‌. అయితే అది సగటు జ్యూస్‌షాప్‌ కాదు. ఆషిక్‌ కనిపెట్టిన రకరకాల ఫ్లేవర్లు, మిక్స్‌డ్‌ కాంబినేషన్లు అందులో దొరుకుతాయి. జనం బాగా కనెక్ట్‌ అయ్యారు. అతని జ్యూస్‌ షాప్‌ మంచి హిట్‌. కాని ఇంకా జీవితంలో సాధించాలి అంటే ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాడు ఆషిక్‌. ‘మాస్టర్‌ షెఫ్‌’ అందుకు వేదికగా నిలిచింది.

విఫలమైనా ముందుకే
2022 మాస్టర్‌ షెఫ్‌ ఆడిషన్స్‌కు వచ్చిన ఆషిక్‌ రిజెక్ట్‌ అయ్యాడు. ‘చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను. మళ్లీ ఏమీ వండలేననే అనుకున్నాను. కాని సాధించాలి... మనసుపెట్టి పోరాడాలి అని నిశ్చయించుకున్నాను. 2023 ఆడిషన్స్‌ వచ్చేవేళకు చాలా కష్టపడి తర్ఫీదు అయ్యాను సొంతగా. షో ముందుకు వెళ్లేకొద్దీ సవాళ్లు ఎదురైనా ఛేదిస్తూ విజేతగా నిలిచాను’ అన్నాడు ఆషిక్‌. ఫైనల్స్‌ ఎపిసోడ్‌లో ఆషిక్‌ తల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె సమక్షంలోనే ఆషిక్‌ను విజేతగా ప్రకటించారు. కొడుకు విజేత అవుతాడో లేదోనని ఆమె ఉత్కంఠగా ఎదురు చూసింది. ఆపై కొడుకు విజయానికి పులకించిపోయింది.

కాగా ఈ సీజన్‌లో మేఘాలయాకు చెందిన స్కూల్‌ ప్రిన్సిపల్‌ నంబి మొదటి రన్నర్‌ అప్‌గా, జమ్ము–కశ్మీర్‌కు చెందిన రుక్సర్‌ అనే ఫుడ్‌ టెక్నిషియన్‌ సెకండ్‌ రన్నర్‌ అప్‌గా నిలిచారు. ప్రసిద్ధ షెఫ్‌లు వికాస్‌ ఖన్నా, రణ్‌వీర్‌ బ్రార్, గరిమా అరోర జడ్జీలుగా వ్యవహరించారు. రొయ్యలతో ఆషిక్‌ చేసిన ‘క్రిస్పీ ప్యారడైజ్‌’ అనే వంటకాన్ని రుచి చూసిన జడ్జ్‌ రణ్‌వీర్‌ బ్రార్‌ తన సంతకం కలిగిన కిచెన్‌ నైఫ్‌ బహూకరించడం విశేషం. 

హోటల్‌ రంగంలోగాని, స్వయం ఉపాధికిగాని పాకశాస్త్రం నేడు చాలా అవసరంగా ఉంది. మంచి షెఫ్‌లకు చాలా డిమాండ్‌ ఉంది. అదెలా ఉన్నా తెల్లారి లేస్తే మూడుపూట్లా తినాలి కనుక, వంట కేవలం ఆడవారి వ్యవహారం అనే భావన పోయి, ఇకమీదైనా అబ్బాయిలకు తల్లులు కనీసం అవసరమైనంత వంట నేర్పడం మంచింది. ఏమో... వారు ఇంకా బాగా నేర్చుకుంటే మరో మాస్టర్‌ షెఫ్‌ అవుతారేమో. ఏ ప్లేట్‌కు ఏ పదార్థం రాసి పెట్టుందో ఎవరు (రుచి) చూసొచ్చారు కనుక.

(చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్‌ చూసి కంగుతిన్న వైద్యులు)
  

Advertisement
 
Advertisement
 
Advertisement