ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో 9.20శాతం పెరుగుదల.. ఇతర వర్గాల్లో 8.5 శాతం
గృహ వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య తగ్గుతున్న అంతరం
జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్దకాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ(హెచ్‌సీఈఎస్) నివేదిక వెల్లడించింది.
2011–12 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వినియోగ వ్యయం 9.20శాతం పెరిగింది. కాగా, ఇతర వర్గాల్లో 8.5శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహావసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందని తెలిపింది.
హెచ్‌సీఈఎస్ నివేదికలోని ప్రధాన అంశాలు
» 2011–12 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం (ఎంపీసీఈ) రూ.1,430 ఉండగా, 2022–23లో రూ.3,773కు పెరిగింది.
» పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011–12లో రూ.2,630 ఉండగా, 2022–23లో రూ.6,459కు పెరిగింది.
» గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం ఆహార పదార్థాలకు, 54శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు.
» పట్టణ ప్రాంతాల్లో 39శాతం ఆహార పదార్థాలకు, 61శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు.
» సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ చివరి స్థానంలో ఉంది.
» ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,870 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.6,782లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment