తాటిపర్తి అపర్ణాదేవి ఆలయంలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు
తాళాల కోసం తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు
పిఠాపురం కూటమి నేతల్లో తగ్గని వివాదాలు
పిఠాపురం/సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో రెండ్రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ కారుపై జనసేన శ్రేణుల దాడి ఘటన మరువక ముందే.. అదే మండలం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో రెండు పార్టీలు ఆదివారం మళ్లీ కుమ్ములాడుకున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు తమదేనని టీడీపీ నేతలు.. కాదు తమదేనంటూ జనసేన నేతలు రచ్చకెక్కారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలివీ..తాటిపర్తి అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో గ్రామంలో పూర్వం నుంచీ ఒక ఆనవాయితీ ఉంది. నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా నెగ్గితే ఆ పార్టీకి చెందిన నేతలు ఐదేళ్లూ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే ఉత్సవాల వంటి అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఇప్పటివరకూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆలయ బాధ్యతలు చూసేవారు.
ఇటీవల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆలయ బాధ్యతలు అప్పగించేస్తామంటూ వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ, జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వస్తే అందరి సమక్షంలో ఆలయ తాళాలు ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో కూటమి నేతలు ఆదివారం ఉదయం ఆలయం వద్దకు వచ్చారు. పిఠాపురంలో జనసేన నెగ్గడంతో ఆ పార్టీకి చెందిన నేతలకు వైఎస్సార్‌సీపీ నాయకులు అందరి సమక్షంలో ఆలయ తాళాలు అందజేశారు. దీనికి గ్రామస్తులందరూ ఆమోదం తెలిపారు.
సంయమనం పాటించాలి : నాగబాబు
మరోవైపు.. ఈ ఘటనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందిస్తూ.. కూటమి సభ్యుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన ఘటన వివరాలు సేకరిస్తున్నామని, ఇందులో తమ పార్టీ వారు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాటిపర్తిలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై కూడా నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పదిరోజుల్లో పవన్ పిఠాపురం వస్తారని చెప్పారు.
వివాదానికి టీడీపీ ఆజ్యం..
అయితే, ఈ విషయం టీడీపీ నియోజకవర్గ నేతకు తెలిసింది. జనసేనను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఆ నేత టీడీపీ వారికే ఆలయ పెత్తనం ఇచ్చేలా పట్టుబట్టాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో అప్పటివరకూ అన్నింటికీ అంగీకారం తెలిపిన టీడీపీ నేతలు.. ఒక్కసారిగా వివాదానికి తెరలేపారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో నెగ్గింది జనసేన అయినా గెలిపించింది తామేనని.. అందుకే తమకే ఆలయ తాళాలు అప్పగించాలని టీడీపీ నాయకులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో జనసేన–టీడీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇరువర్గాలూ బాహాబాహీకి దిగడంతో ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలనూ చెదరగొట్టారు. అయినప్పటికీ తాళాలిచ్చే వరకూ కదిలేదిలేదని టీడీపీ నేతలు ఆలయం వద్ద బైఠాయించారు. ఇరువర్గాలతో చర్చించిన పోలీసులు వివాదం తేలేవరకు ఆలయ తాళాలు అధికారుల వద్ద ఉండేలా ఒప్పించారు. అనంతరం తాళాలను స్థానిక వీఆర్‌ఓకు అప్పగించారు.
తమకు ఎలాగూ ఆలయం దక్కేదిలేదని గ్రహించిన టీడీపీ నేతలు ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగించాలనే డిమాండును తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం గ్రామంలో జోరుగా జరుగుతోంది. అపర్ణాదేవి ఆలయం దేశంలోనే పేరొందింది. ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేకమంది భక్తులు, వీఐపీలు వస్తూంటారు. ఆదాయం కూడా అంతలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలయంపై పెత్తనం తమకు దక్కకపోతే.. జనసేనకూ దక్కకూడదని భావించిన టీడీపీ నేతలు.. ఈ ఆలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment