ఫెయిల్యూర్స్ అనేవి ఒకదాని తరువాత ఒకటి వరుస కడితే, ఎవరైనా ఏంచేస్తారు? ‘ఇక చాలు నాయనా’ అని వెనక్కితగ్గుతారు. సక్సెస్‌ను గట్టిగా కోరుకునేవారు మాత్రం ‘తగ్గేదేలా’ అనుకుంటారు. రాజన్ బజాజ్ ఈ కోవకు చెందిన యువకుడు. మూడు ఫెయిల్యూర్స్ తరువాత...‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టిన ఘనుడు...
‘బజాజ్’ అనే మాట వినిపించగానే పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ‘బజాజ్’కు రాజస్థాన్ అల్వార్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజన్ బజాజ్‌కు బీరకాయ పీచు బంధుత్వం కూడా లేదు. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో చదువుపూర్తయిన తరువాత రాజన్ ‘ఫ్లిప్‌కార్ట్’లో ఉద్యోగం చేశాడు.
పదినెలల తరువాత... ‘ఇలా అయితే ఎలా?’ అనుకున్నాడు. దీనికి కారణం ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి స్టార్ అనిపించుకోవాలనేది తన కల. ‘ఫ్లిప్‌కార్ట్’లో తనకు చాలా బాగుంది. ఇలా సంతృప్తి పడి అక్కడే ఉంటే, తన కల కూడా కదలకుండా అక్కడే ఉంటుందని తనకు తెలుసు.
ఉద్యోగం వదిలేసిన తరువాత...
బెంగళూరులో ‘మెష్’ పేరుతో గేమింగ్ కన్సోల్స్, కెమెరా, డీవిడీలు అద్దెకు ఇచ్చే బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. తన బైక్‌పై తిరుగుతూ ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు. ‘అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్, థర్డ్‌హ్యాండ్ నాసిరకం వస్తువులు మీకేలా?’ అనేది తన నినాదం అయింది. రెండు నెలల తరువాత డెలివరీ బాయ్‌ని నియమించుకున్నాడు.
రెంటల్‌కు మార్కెట్ పెద్దగా లేకపోవడం, డ్యామేజీ...మొదలైన కారణాలతో ‘మెష్’కు టాటా చెప్పాడు. ఆ తరువాత ‘కార్ అండ్ బైక్’ రెంటల్ బిజినెస్‌లోకి వచ్చాడు. రోజుకు 20 నుంచి 30 వరకు ఆర్డర్లు వచ్చేవి. యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నష్టాలు, కార్ల నిర్వాహణ కష్టం కావడంతో ఈ వ్యాపారానికి కూడా ‘బైబై’ చెప్పాడు. ఆ తరువాత ‘ఫర్నిచర్ రెంటల్’ బిజినెస్‌లోకి దిగాడు. ఇది కూడా నిరాశపరిచింది.
ఆగిపోయాడు... ఆలోచించాడు...
‘చేసింది చాలు ఇక రాజస్థాన్‌కు వెళ్లిపోదాం’ అనుకోలేదు. పోయిన చోటే వెదుక్కోవాలి అంటారు కదా! ఆగిపోయాడు. ఆలోచించాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘బై–నౌ–పే–లాటర్’ (బీఎన్‌పీఎల్) వెంచర్ గుర్తుకు వచ్చింది. ఆ తరహాలోనే యువతరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ‘స్లైస్ పే’ను స్టార్ట్ చేశాడు.
ఇఏంఐ పేమెంట్స్ సర్వీస్‌గా చిన్న స్థాయిలో మొదలైన ‘స్లైస్’ ఇండియాలో చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగి, అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ‘విసా’తో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది.
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ తీసుకుంది. ‘స్లైస్’ స్టార్టప్ మెగా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ‘గతంతో పోల్చితే యంగ్ జెనరేషన్‌కు క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేసింది స్లైస్’ అంటారు విశ్లేషకులు. మరి రాజన్‌ను అడిగి చూడండి. ఇలా అందంగా చెబుతాడు... ‘ఫెయిల్యూర్స్ గెలుపు పాఠాలు చెబుతాయి. అవి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే’ !
చదవండి: Suman Kalyanpur: ఓడిన కోకిల... ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే..
Comments
Please login to add a commentAdd a comment