జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది.
పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్‌ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు.
పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి...
రైతుల సమస్యలు ఇవీ...
► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి.
► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి.
► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది.
► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది.
► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది.
► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి.
► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది.
► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు.
► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది.
ఇవీ డిమాండ్లు...
► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి.
► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి.
► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి.
► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి.
► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి.
► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి.
► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి.
ఆందోళనలు ఏయే దేశాల్లో...
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment