టెల్ అవీవ్: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్ మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరంపై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి.
హమాస్ అంతమే ధ్యేయంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్ సేనలు.. ఆదివారం గాజాలో రెండు శరణార్థి శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 53 మంది మరణించారు. అటు.. హమాస్‌ను అంతం చేసేవరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. తమకు ఇంకో దారి లేదని తెలిపారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ అని గుర్తుచేశారు. మరోవైపు దక్షిణ గాజాలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు.
ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 1400 మంది మరణించారు. 280 మంది నిర్బంధంలో ఉన్నారు.
ఇదీ చదవండి: Vladimir Putin Body Doubles: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్?
Comments
Please login to add a commentAdd a comment