సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత | Sakshi
Sakshi News home page

సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత

Published Sun, Mar 24 2024 5:27 AM

Russian intervention in the Syrian civil war - Sakshi

అందుకే రష్యాపై ఐసిస్‌ విద్వేషాగ్ని

రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ (ఐసిస్‌) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది.

సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్‌ జోక్యం రష్యాపై ఐసిస్‌ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది...

అలా మొదలైంది...
ఐసిస్‌ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్‌ అల్‌ అసద్‌కు పుతిన్‌ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్‌ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్‌ ఖోరసాన్‌ (ఐసిస్‌–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్‌ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్‌–కెనే.

దీన్ని పాకిస్థానీ తాలిబాన్‌ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్‌ కమెండోలు, అఫ్గాన్‌ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్‌–కె ఆగడాలకు కళ్లెం పడింది.

అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ నుంచి వైదొలగడంతో ఐసిస్‌–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్‌ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్‌ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్‌లో దివంగత మేజర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది.

ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్‌–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్‌ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా.

మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్‌–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్‌ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement