రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.
ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.
Comments
Please login to add a commentAdd a comment