ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి
అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసాకాండ
టీడీపీ రాళ్లదాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలు
బాష్పవాయువు ప్రయోగం గాల్లోకి పోలీసుల కాల్పులు
ఎస్పీ అమిత్‌బర్దర్, బీఎస్‌ఎఫ్ బలగాలపైనా రాళ్ల దాడి
గాయపడిన బీఎస్‌ఎఫ్ జవాను
టీడీపీ శ్రేణుల ఆగడాల అదుపులో పోలీసుల వైఫల్యం
తాడిపత్రి/తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ నాడు మొదలైన పచ్చ ముఠా హింసాకాండ మంగళవారమూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొనసాగింది.. సోమవారం పోలింగ్ సందర్భంగా దాడులకు దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు.. మంగళవారమూ తాడిపత్రిలో రెచ్చిపోయారు.
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి చేశారు.
దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులూ ప్రతిఘటనకు దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలూ పరస్పరం రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అడ్డొచ్చిన పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
బరి తెగించిన టీడీపీ కార్యకర్తలు
తాడిపత్రి పట్టణంలోని గానుగవీధికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సంజీవ సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా 230వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఏజెంటుగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకుడు సూర్యముని తన వర్గీయులు భాను, కిరణ్, అశోక్, వేణు మరికొందరితో కలిసి సంజీవపై దాడి చేశారు.
అతని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా అతని మిక్చర్ బండినీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సంజీవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద పెద్దఎత్తున గుమిగూడిన టీడీపీ అల్లరి మూకలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వారిని చూసిన టీడీపీ అల్లరి మూకలు పోలీసులపైనా రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తాడిపత్రి అర్బన్ సీఐ మురళీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
జేసీ ప్రభాకర్ గూండాగిరి
దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులను వెంటేసుకుని సీబీ రోడ్డులో భయానక వాతావరణం సృష్టిస్తూ వస్తుండగా..పోలీసు బలగాలు అడ్డుకున్నా, ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో పుట్లూరు రోడ్డు గుండా సంజీవనగర్ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు.
అప్పటికే పక్కా ప్రణాళికతో తన ఇంటి ముందున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్ధంగా ఉంచుకున్న ట్రాక్టర్లలోని రాళ్లతో టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలోని వారందరూ ఇళ్లకు తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఐదు వేల మందికి పైగా జేసీ అనుచరులు గుమిగూడి ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
అయినా వారు వినకుండా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, బీఎస్‌ఎఫ్ బలగాలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు సైతం పరుగెత్తాల్సివచ్చి0ది. చివరకు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. జేసీ అనుచరులు ఒక్కసారిగా నాగాలాండ్ నుంచి వచ్చిన బీఎస్‌ఎఫ్ బలగాలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో బీఎస్‌ఎఫ్ జవానుల్లో ఒకరి కంటికి తీవ్ర గాయమైంది. జేసీ అనుచరులు విచక్షణ కోల్పోయి దాడులకు దిగడంతో ఎస్పీ అమిత్‌బర్దర్, డీఎస్పీ గంగయ్య, పోలీసులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో ఆగని అల్లరి మూకలు మరింత రెచ్చిపోయి బాణా సంచాకు నిప్పు పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు విసిరారు.
పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన ఎస్పీ పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముíÙతో పాటు కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, ట్రైనీ ఎస్పీలు తాడిపత్రికి చేరుకుని భద్రతను సమీక్షించారు. ఆయా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.
పోలీసుల వైఫల్యమే కారణం
రెండు రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు పోలీసుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. తాడిపత్రి అసలే సమస్యాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన బలగాలను మంగళవారం ఉదయమే పంపేశారు. దాడులు జరుగుతాయని ముందస్తుగా పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
పోలీసు బలగాలను పట్టణంలో అలాగే ఉంచి ఉంటే మంగళవారం ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ వర్గీయుల పట్ల పోలీసులు అవలంబిస్తున్న మెతకవైఖరే అందుకు కారణమన్న బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment