దన్వాడ: ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో కొందరు కేడీలు నయా మోసానికి తెరలేపారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసేందుకుగాను రూ.236 చొప్పున వసూలు చేసి వినియోగదారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో బుధవారం ఆరుగురు వ్యక్తులు వినియోగదారుల ఇళ్లకు వెళ్లారు.
ప్రతి సంవత్సరం గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకుగాను రూ.236 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేయించుకోకపోతే సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. వీరి మాటలు నమ్మిన కొందరు వినియోగదారులు.. గ్యాస్ కనెక్షన్ చెకప్ కోసం రూ.236 చొప్పున చెల్లించారు. గ్రామంలో మొత్తం 300 కనెక్షన్లు ఉండగా.. 200 మంది నుంచి దాదాపు రూ.50వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
కొందరికి అనుమానం వచ్చి గురువారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించగా.. తాము ఎలాంటి చెకప్‌లు చేయడంలేదని తెలిపారు. తమ కార్యాలయంలోనే సిలిండర్‌ను పూర్తి స్థాయిలో చెక్‌చేసి, వినియోగదారులకు అందజేస్తామని తెలియజేశారు. కాగా గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో డబ్బులు వసూలు చేసిన దుండగులు.. అందుకు సంబంధించిన రసీదులు ఇవ్వడం గమనార్హం.
ఏదేమైనప్పటికీ రోజురోజుకు కొత్త కొత్త మోసాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మా లో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment