Nagarjuna Comments on Love Story Movie Success - Sakshi
Sakshi News home page

Love Story: చైతూ, శేఖర్‌పై ప్రశంసలు కురిపించిన నాగార్జున

Published Wed, Sep 29 2021 12:11 AM

Nagarjuna Speaking At The Magical Success Meet Of Love Story Movie - Sakshi

‘‘దేశంలో కోవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. భారత ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారు మంచి నిర్ణయాలు తీసుకుని కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరవలేదు. తెలంగాణలో 100 శాతం, ఆంధ్రాలో అక్కడి పరిస్థితులను బట్టి 50 శాతం థియేటర్లు తెరిశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపే చూశాయి’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ ఆఫ్‌ లవ్‌ స్టోరీ’లో నాగార్జున మాట్లాడుతూ –‘‘కొన్ని వారాల క్రితం విడుదలైన ఓ హిందీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్లు షేర్‌ వస్తే.. ‘లవ్‌స్టోరీ’కి ఏడు కోట్లు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కోటి నమస్కారాలు. శేఖర్‌ సెన్సిటివ్‌ డైరెక్టర్‌.. కానీ అదొక్కటే సరిపోదు.

దాన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్స్‌ చేసి తీయాలి.. శేఖర్‌ అది నేర్చుకున్నాడు. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్‌ అండ్‌ స్టార్‌.. ఇవి రెండూ డిఫరెంట్‌ పదాలు. చైతూను ఒక స్టార్‌ యాక్టర్‌గా తయారు చేశాడు శేఖర్‌. చైతూ.. బాగా నటించావ్‌. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్‌. ‘ప్రేమనగర్‌’ రిలీజ్‌ టైమ్‌లో తుఫాన్, సైక్లోన్‌ అన్నీ ఉన్నా నాన్నగారి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్, సైక్లోన్‌తో పోరాడి ‘లవ్‌స్టోరీ’ గొప్ప విజయాన్ని సాధించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్‌ కావడం టాలీవుడ్‌కు శుభపరిణామం’’ అన్నారు నారాయణ్‌దాస్‌ నారంగ్‌.

‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్‌. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్‌ వచ్చింది’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్‌ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్‌గారి కంటెంట్‌ పవర్‌ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది.

సినిమా స్టార్ట్‌ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్‌ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) థ్యాంక్స్‌. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్‌ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్‌ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్‌ సీహెచ్, మంగ్లీ, రోల్‌ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement