సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రీ సర్వే చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధుల కేటాయింపుతో పాటు నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
అశ్విని వైష్ణవ్‌తో బండి భేటీ
శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం అందించారు. ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి 2013లో సర్వే చేసినప్పటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా పురోగతి లేకుండా పోయిందని సంజయ్ తెలిపారు. దాదాపు 62 కి.మీ. లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీకి , వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ఈ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కూడా సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి అధికారులను పిలిపించి మాట్లాడారు. కరీంనగర్ –హసన్‌పర్తి లైన్ కు తక్షణమే రీసర్వేకు ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్య లు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదే శించారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: సంజయ్
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణం ఆలస్యమైందని, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ తప్పిదంతో రాష్ట్రానికి అన్యాయం
’కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని సంజయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రజల వనరుల శాఖ సలహా దారు వెదిరే శ్రీరాంతో కలిసి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి రాష్ట్రప్రజలకు నష్టం కలిగించారని వివరించారు. కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అను మతి ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులను పిలిచి మాట్లాడారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment