ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బతికి బట్టకట్టినవారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులకు నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రైలు ప్రమాదంలో గాయాలపాలైనవారిలో కొందరు తీవ్రమైన ఆందోళనలో ఉండగా, మరికొందరు ఏడుస్తున్నారు. ఇంకొందరు మౌనంగా కనిపిస్తున్నారు. తమకు భయానక కలలు వస్తున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 105 మంది బాధితులలో సుమారు 40 మందిలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ) లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరందికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బాధితులలోని భయాన్ని పోగొట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. వైద్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
చదవండి: ఆ స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు.. ఎందుకంటే?
బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం
క్లినికల్ సైకాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జషొబంత్ మహాపాత్ర మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారి మానసిక పరిస్థితులను గమనించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇటువంటి ఘోర ప్రమాదాన్ని చూసినప్పుడు బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అటువంటప్పుడు భాధితులు తరచూ ఆందోళనకు గురికావడం, ఉన్నట్లుండి ఉలిక్కిపడటం, రోదించడం మొదలైనవి చేస్తుంటారన్నారు. మరికొందరు ఎవరితోనూ మాట్లాడక మౌనంగా ఉంటారన్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారికి తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం నాలుగు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలలో మానసిక నిపుణులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారన్నారు.
నిద్రకు దూరమై..
ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన ఒక నర్సు మాట్లాడుతూ బాధితులలో చాలామంది సరిగా నిద్రపోవడం లేదన్నారు. వారికి ఇంకా ప్రమాదంనాటి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. కాగా ఈ ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడొకరు చేతులు,కాళ్లు కోల్పోయాడు. అతను నిద్రపోవడంలేదు. వైద్యులు కళ్లుమూసుకుని పడుకోమని చెప్పినప్పుడు, కళ్లు మూసుకుంటే నాటి భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయని సమాధానిమిస్తున్నాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఒక యువకుడు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయాడు. దీంతో ఇతను తరచూ తన స్నేహితుని పేరును గట్టిగా పలుకుతున్నాడు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక వైద్యుడు మాట్లాడుతూ బాధితులు తమ స్థితిని చూసుకుని ఏడుస్తున్నారని, మరికొందరు విచిత్రంగా నవ్వుతున్నారని తెలిపారు. బాధితులలోని ఇటువంటి లక్షణాలను గమనించి వారికి చికిత్స అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment