Paralympian Devendra Jhajaria: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది.
భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్‌లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే.
రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్‌ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment