విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ దాదాపుగా ఖరారైపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఎంట్రీతో శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనుంది.
శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో వరుసగా విఫలవుతుండటంతో అతనికి ఇచ్చిన అవకాశాలు చాలని మేనేజ్‌మెంట్ భావిస్తుంది. గిల్ స్థానంలో వన్‌డౌన్ ఆటగాడిగా రజత్ పాటిదార్‌ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు రెండో టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. కండరాల సమస్యతో బాధపడుతున్న రవీంద్ర జడేజా స్థానంలో సుందర్ బరిలోకి దిగేందకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది.
విశాఖ టెస్ట్‌లో భారత్ ఈ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్, రజత్ పాటిదార్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. మేనేజ్‌మెంట్ ఏదైనా సాహసం చేయాలని భావిస్తే తప్ప వీరిద్దరి ఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు.
దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న సర్ఫరాజ్
దేశవాలీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న ఈ ఇద్దరూ చాలాకాలంగా టీమిండియాలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కీలక ఆటగాళ్లు గాయపడంతో ఎట్టకేలకు వీరి కలలు సాకారాం కానున్నాయి. 26 ఏళ్ల సర్ఫరాజ్ 2014, 2016 అండర్ వరల్డ్‌కప్‌లలో మెరిసి దేశవాలీ క్రికెట్‌లో స్టార్‌గా ఎదిగాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇతనికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో సర్ఫరాజ్ 66 ఇన్నింగ్స్‌ల్లో 69.85 సగటున 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3912 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.
ఇక ఐపీఎల్‌లోనూ సర్ఫరాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి దాకా మొత్తంగా 37 ఇన్నింగ్స్ ఆడి 585 పరుగులు చేశాడు. గత సీజన్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
పాటిదార్ ఇలా
మరోవైపు పాటిదార్‌కు కూడా దేశీవాళీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు అతను ఆడిన 55 మ్యాచ్‌ల్లో 45.97 సగటున 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సాయంతో 4000 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా వీరు సెంచరీలతో కదంతొక్కారు. 30 ఏళ్ల పాటిదార్ ఇటీవలే వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది చివర్లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో పాటిదార్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment