సర్ఫరాజ్‌ ఖాన్‌కు సారీ చెప్పిన జడేజా | IND Vs ENG 3rd Test: Ravindra Jadeja Apologies To Sarfaraz Khan For Unintentional Run Out In Rajkot Test - Sakshi
Sakshi News home page

IND VS ENG 3rd Test: సర్ఫరాజ్‌ ఖాన్‌కు సారీ చెప్పిన జడేజా

Published Thu, Feb 15 2024 8:52 PM

IND VS ENG 3rd Test: Ravindra Jadeja Apologies To Sarfaraz Khan For Unintentional Run Out In Rajkot Test - Sakshi

రాజ్‌కోట్‌ టెస్ట్‌లో తన కారణంగా రనౌటైన అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. అలాగే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టినందుకు సర్ఫరాజ్‌ను ఆకాశానికెత్తాడు.

మ్యాచ్‌ అనంతరం జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాన్ని కలగలిపి షేర్‌ చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయంలో చాలా బాధగా ఉంది. తప్పు నాదే. లేని పరుగు కోసం​ పిలుపునిచ్చాను. బాగా ఆడావు సర్ఫరాజ్‌ అంటూ జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

రనౌట్‌ ఉదంతంపై సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా స్పందించాడు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇలా అన్నాడు. మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల అలా జరిగింది. జడ్డూ భాయ్‌ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. నేను పర్లేదు అని చెప్పాను. దీనికంటే ముందు నేను జడేజాకు థ్యాంక్స్‌ చెప్పాలి. క్రీజ్‌లో ఉన్నంతసేపు అతను నాకు అండగా నిలిచాడు. విలువైన సలహాలు ఇచ్చి నన్ను గైడ్‌ చేశాడు. ​

కాగా, అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏ బెదురు లేకుండా యధేచ్చగా షాట్లు ఆడి మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు లేని పరుగుకు కోసం సర్ఫరాజ్‌ను పిలిచి రనౌట్‌ చేయించాడు. సర్ఫరాజ్‌ను అనవసరంగా ఔట్‌ చేయించానన్న బాధలో జడేజా సెంచరీ సెలబ్రేషన్స్‌ కూడా చేసుకోలేదు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్‌) బాధ్యతాయుతమైన సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్దశతకం (62) తోడైంది. ఈ ముగ్గురు కలిసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులుగా ఉంది. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పాటిదార్‌ (5) నిరాశపరిచారు. జడేజాతో పాటు కుల్దీప్‌ యాదవ్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, టామ్‌ హార్ల్టీ ఓ వికెట్‌ పడగొట్టగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌటయ్యాడు. 

Advertisement
Advertisement