వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..! | Sakshi
Sakshi News home page

వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!

Published Mon, May 6 2024 5:25 PM

Summer Healthy Buttermilk Drinks In Ancient Way

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ  మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!

'కూర్చిక' పానీయం:    
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు,  పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.

'రసాల' పానీయం:
పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. 

ఎలా చేస్తారంటే..?

  • బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.

  • పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి.  అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు 

  • ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి.  చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.

తేటతో కూడా..

  • ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. 
     

  • మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే  పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి,  చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. 

  • ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా  ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.

తేమనం..
తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.

మజ్జిగమీద తేట:
మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్‌ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.

(చదవండి: సమ్మర్‌లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!)

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement