ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజకీయ నేతలు ఎంతటి గొప్ప నటులో అర్ధం చేసుకునే సన్నివేశం అని చెప్పాలి. ఈ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్ లు రద్దు చేస్తారంటూ చెప్పిన నకిలీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు స్పందించి కొంతమందిని అరెస్టు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. ఇది మంచి విషయమే.తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా ఎన్నికలలో గెలవాలని దష్ట తలంపుతో ఉన్నవారికి ఇది గుణపాఠమే అవుతుంది. ఇంతవరకు ఓకే. కానీ..
అదే కేంద్ర మంత్రి పక్కన అలాంటి కేసులో ఉన్న ఒక వ్యక్తి నిలబడితే.. ఆ వ్యక్తిని ఆ మంత్రి పొగుడుతుంటే ఏమని అనాలి? ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్య లోపమా? లేక వ్యక్తులలో నిజాయితీ,నిబద్దత లేనితనమా ?అంటే ఏమి చెబుదాం. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక ఐవీఆర్ఎస్ ద్వారా లక్షల మందికి తప్పుడు సమాచారాన్ని పంపించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడుగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన తనయుడు లోకేష్ రెండో నిందితుడుగా ఉన్నారు. వీరిద్దరూ కాకుండా ఇంకో పది మందిపై కూడా కేసు నమోదైంది. ఇది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ పెట్టిన కేసే. హోం మంత్రి అమిత్ షా పై తప్పుడు వీడియో సృష్టిస్తే దేశవ్యాప్తంగా హడావుడి చేసి కొందరిని ఇప్పటికే అరెస్టు చేస్తే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు ఫోన్ కాల్ సృష్టించి ప్రచారం చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి పక్కన ఎలా ప్రచారంలో పాల్గొనగలుగుతారు. ఆ తదుపరి సాయంత్రానికే ఏపీ డీజీపీని బదిలీ చేయడం జరిగింది. అంటే.. ఏమిటి అర్ధం?.
అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసినవారు జైలకు వెళతారు. అదే ఏపీ ముఖ్యమంత్రి పై తప్పుడు ఆడియోలు సృష్టిస్తే ,నిందితులపై కేసు నమోదు చేస్తే.. ఏకంగా డీజీపీనే బదిలీ అవుతారు. కూటమి నేతలు చంద్రబాబు,పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఒత్తిడికి లొంగే వారు డీజీపీని బదిలీ చేశారని జనం అనుకోరా?. ఇది డబుల్ స్టాండర్స్ కాదా? అంటే ఏమి చెబుతాం.
విశేషం ఏమిటంటే ఆ చంద్రబాబు నాయుడుకు అమిత్ షా సర్టిఫికెట్ ఇవ్వడం. ఆయన వచ్చి జగన్ పై విమర్శలు చేయడం. 2019 ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షాపై రాళ్లదాడి చేసి అవమానించారు. దేశ ప్రధాని మోదీని ఏకంగా టెర్రరిస్టు, మంచివాడు కాదు.. అసలు మోడీ దేశంలో ఉండడానికే తగడు అని దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిద్దరి సరసన దర్జాగా కూర్చోగలుగుతున్నారు. ఈ ఘట్టాలలో ఎవరు కరెక్టు అనుకోవాలి?. చంద్రబాబు ఏమైనా తన ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు ,క్షమాపణ కోరినట్లు తెలిపారా?.. అంటే అదేమీ లేదు. మరి దేనికి చంద్రబాబు వారి వద్దకు వెళ్లి బతిమలాడుకున్నారు. బీజేపీవారు ఎందుకు లొంగిపోయారు అంటే.. అదే బ్రహ్మ రహస్యం.
పోలవరం ప్రాజెక్టు గురించి అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారు.అంటే వేరే వారు వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారా? ఏపీలో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీతో జతకట్టామని అమిత్ షా చెబితే నమ్మడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు. 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత ఎన్ని రకాలుగా చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించారో తెలియదా?. ఇప్పుడు వచ్చి కొత్త కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు?.
గత ఐదేళ్లలో ఏపీలో ఉన్న ప్రశాంతత మరెక్కడైనా ఉందా?. కేవలం టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియానే ఏ చిన్న ఘటన జరిగినా.. చిలవలు, పలవలు చేసి ప్రచారం చేయడం మినహాయించి మరేయితర ఘటనలు ఏమీ జరగలేదని చెప్పాలి. అమరావతి రాజధాని చేయడానికి కూటమి కట్టామని అంటున్నారు. అప్పట్లో ఈ అమరావతి , పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడుకు ఏటీఎంలు అయ్యాయని, ప్రధాని సహా పలువురు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు బహుశా అమిత్ షా మర్చిపోయి ఉండొచ్చు. ధర్మవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అదేదో తెలుగుదేశం పార్టీవారు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా చదివినిట్లు ఉంది తప్ప.. బీజేపీ భావజాలానికి తగ్గట్లుగా మాట్లాడినట్లు అనిపించదు. కీలకమైన విశాఖ నగరానికి వ్యతిరేకంగా అమిత్ షాతో కూడా మాట్లాడించినట్లు అనుకోవాలా?.
జగన్ పై ఏదో అవినీతి ఆరోపణలు చేయాలి కనుక చేసినట్లు ఉంది తప్ప, ఎన్నికల కోసం.. టీడీపీని సంతృప్తిపరచడం కోసం ఉపన్యసించినట్లు ఉంది తప్ప, అమిత్ షా సొంత ఆలోచనలకు తగ్గట్లు మాట్లాడలేదు. ఏపీలో అవినీతి గురించి మాట్లాడడానికి ముందు అమిత్ షా కొన్నింటికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.
2019 లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కనుకొన్నట్లు సీబీటీడీ ప్రకటించిందా?లేదా?.. ఆ కేసు ఇంతవరకు అతీగతి లేకుండా పోయిందేమిటి?.. మోదీని, అమిత్ షా ను సంతోషపెడితే ఎంతటి కేసు అయినా హుష్ కాకి అవుతుందా?
ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మనీలాండరింగ్ తదితర ఆరోపణలపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబు ఏదో దాటవేత జవాబులు ఇస్తూ తప్పించుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు కూర్చుంది?.
స్కిల్ స్కామ్ తో సహా పలు కుంభకోణాలలో చంద్రబాబు పాత్ర ఉందని కేసులు నమోదు అయితే.. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అమిత్ షా జనానికి సుద్దులు చెబుతున్నారు. చంద్రబాబు చాలా అభివృద్ది చేశారట. జగన్ వచ్చాక జరగలేదట. ఇదే మాట గతంలో ఎన్నడూ ఎందుకు చెప్పలేదు?. అప్పట్లో చంద్రబాబు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేశారే. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా వంద లేఖలు రాసి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించారే. అవన్నీ మర్చిపోయారా?..
ఇవన్నీ ఎందుకు.. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మాజీ ఎంపీ సుజనా చౌదరి బిజెపి పక్షాన ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమం నుంచి పోటీచేస్తున్నారు. వందల కోట్లకు ఎగనామం పెట్టడమే కాకుండా కొన్ని చీటింగ్ కేసులలో కూడా ఉన్న మరో మాజీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. అంతకుముందు వీళ్లు టీడీపీలో ఉన్నారు. బీజెపీలో చేరగానే వాషింగ్ మెషిన్ వేసి శుద్ది చేసేశారని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. దేశం అంతటా ఇదే కథ నడుపుతున్న బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుకు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న నానుడి గుర్తుకు వస్తుంది.
శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతాం అని కూడా షా చెప్పారు. అహా ఎంత గొప్ప మాట అండి.ఇప్పుడు తిరుమల పవిత్రతకు ఏమీ భంగం రాలేదు. బీజేపీ వాళ్లు వచ్చి ఏ చిచ్చు పెట్టకుండా ఉంటే చాలు.
తెలంగాణలో రెచ్చిపోయి ముస్లిం రిజర్వేషన్ లు రద్దు చేస్తామని ప్రసంగించే అమిత్ షా.. ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తినట్లులేరు. ఏమిటి దీని భావం. ఏపీలో తెలుగుదేశం కూటమిలో ఉన్నందున ముస్లింలను మోసం చేయడానికి ఇక్కడ ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారా?. ఇదేనా మీ నిబద్దత. ఇది ప్రజలను వంచించడం కాదా?తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా ముస్లింలు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా?. వాటి గురించి నోరు ఎత్తకుండా వెళ్లిపోవడంలో ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించకపోరు.
ఏది ఏమైనా చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేకపోయినా, ఏదో బలమైన ఒత్తిడి కారణంగా బీజేపీ ఈ కూటమిలో కలవడానికి అంగీకరించినట్లు అనిపిస్తుంది. అందుకే ఏదో మొక్కుబడిగా నాలుగుముక్కలు మాట్లాడి అమిత్ షా వెళ్ళినట్లు భావించవచ్చా?!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment