ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముస్లీంల సమావేశంలో బీజేపీతో పొత్తు గురించి ఎందుకు మాట మార్చారు? డిల్లీలో ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని మూడు రోజుల పాటు వేచి ఉండి హోం మంత్రి అమిత్-షాను కలిసి బీజేపీతో పొత్తు కోసం కాళ్లబేరం ఆడిన చంద్రబాబు నాయుడు మాట మార్చి బీజేపీనే తమతో పొత్తు కోరిందని ఎందుకు చెప్పుకున్నారు? ఇది అబద్దమని తెలిసినా ఆయన ఈ మాట అన్నారంటే బీజేపీతో పొత్తు వల్ల నష్టం ఎక్కువగా జరుగుతోందని భయపడుతున్నారా? ఈ సందర్భంలో ఒక్క నిజం చెప్పినట్లు అనిపిస్తుంది. కేంద్రంతో తనకు అవసరం ఉంది కనుక ఈ పొత్తుకు అంగీకరించానని చంద్రబాబు అన్నారు.
ఇన్నాళ్లు రాష్ట్ర అవసరాల కోసం అని ప్రచారం చేస్తూ వచ్చిన చంద్రబాబు కీలకమైన ఈ సమావేశంలో గబాలున వాస్తవం చెప్పేశారు. తనపై కేంద్రంలో ఉన్న కేసులలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే బీజేపీతో పొత్తు అవసరమని ఆయన చెప్పకనే చెప్పేశారు. అలాగే బీజేపీ సాయంతో రాష్ట్రంలో తనపై స్కామ్‌ల కేసుల నుంచి కూడా బయటపడవచ్చని ఆయన ఆశిస్తుండవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు బీజేపీనే పొత్తు కోరిందని.. అందుకే పొత్తు అని అనడంలో ఆంతర్యం ఏమిటి? బహుశా దీనికి సంబంధించిన వీడియో బయటకు వెళ్లదు అని అనుకుని ఉండవచ్చు. టీడీపీ మీడియా ఈ వార్తను తొక్కిపెట్టింది. కాని సోషల్ మీడియా దానిని బయటకు తీసుకు వచ్చింది. దాంతో చంద్రబాబు మరోమారు అబద్దం ఆడారన్న సంగతి ఏపీ ప్రజలకు తెలిసిపోయింది.
2019లో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి బీజేపీతో అంటకాగడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. పవన్‌కల్యాణ్‌ను ముందుగా బీజేపీ వారి వద్దకు పంపి, బీజేపీతో సత్సంబందాల కోసం ఆయనను మద్యవర్తిగా వాడుకున్నారు. నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. దాంతో బీజేపీ కూడా శాంతించి ఆయనపై ఉన్న ఆర్దిక నేరాల కేసుల ఫైళ్లను పక్కన పడేసింది. వేల కోట్ల స్కాములకు చంద్రబాబు పాల్పడ్డారని ఆరోపించిన కేంద్రం తదుపరి ఒక్క చర్య తీసుకోకుండా చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. ఆ క్రమంలో బీజేపీతో శాసనసభ ఎన్నికలలో పొత్తు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరికి ఢిల్లీకి పవన్‌తో కలిసి వెళ్లి అమిత్-షా అప్పాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూశారు. అది అవమానకరమైనా ఆయన అలా చేశారంటే అవసరం అలాంటిది. అలా చేసిన చంద్రబాబు ముస్లీంలను మోసం చేయడానికి మాట మార్చి బీజేపీవారే తమను పొత్తు అడిగారని చెబుతున్నారు.
నిజానికి చంద్రబాబుకు ఇష్టం లేకపోతే, బీజేపీవారు కోరినా ఒప్పుకోకుండా ఉండవచ్చు. సహజంగానే దీనిపై బీజేపీ నేతలకు కూడా మండుతుంది. కొద్ది రోజుల క్రితం హోం మంత్రి అమిత్-షా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు తనంతట తానే ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లారని, ఓటమి తర్వాత ఆయనకు పరిస్థితి అర్ధమై, తిరిగి చేరారని అన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా టీడీపీని బీజేపీ వద్దకు తీసుకు వెళ్లడానికి తాను బీజేపీ పెద్దల నుంచి చివాట్లు తిన్నానని, వారు అంగీకరించకపోతే తాను దండాలు పెట్టి బతిమలాడానని అన్నారు. అంటే దీని అర్దం చంద్రబాబే బీజేపీ పొత్తు కోసం తహతహ లాడారనే కదా! కాని అలవాటు ప్రకారం మళ్లీ మాట మార్చారు. దానికి కారణం బీజేపీతో పొత్తుపై ఏపీలోని ప్రజలు అంత సుముఖంగా లేరని భావించడం ఒక కారణం అయితే ముస్లీంలు పూర్తిగా ఈ పొత్తును తిరస్కరిస్తుండడం మరో కారణం. వారిని మాయ చేయడానికి గాను చంద్రబాబు ఈ కొత్త రాగం ఆలపించారు. దీనికి సమాధానం చెప్పవలసింది జనసేన, బీజేపీలే.
అయినా ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్, పురందేశ్వరిలను తనదారిలోకే తెచ్చుకున్నారు కనుక వారు ప్రశ్నించరన్న నమ్మకం ఉంది. పైగా పురందేశ్వరి అయితే ఈ పొత్తు చారిత్రక అవసరమని గొప్పగా చెప్పారు. కేవలం రాజమండ్రిలో ఎంపీగా గెలవాలన్న తాపత్రయంలో బీజేపీ పరువు పోతున్నా ఆమె సమర్దించే దుస్థితిలో ఉన్నారు. చంద్రబాబు కాని, పవన్ కల్యాణ్ కాని బీజేపీ నుంచి ఎలాంటి నిర్దిష్ట హామీ పొందకుండా బీజేపీతో కలిశారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వేజోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన చట్టంలోని ఆస్తుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న వివాదాల పరిష్కారం వంటివాటిపై ఒక్క హామీ కూడా తీసుకోకుండా టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఏపీ ప్రజలలో అసంతృప్తి ఉంది. గతంలో మాదిరి ప్రధాని మోదీకి అంత వేవ్ లేదు. ప్రజాగళం పేరుతో జరిగిన సభలో కూడా మోదీని ఈ నేతలు ఒక్క కోరిక కోరలేదు. మోదీ కూడా రాష్ట్రానికి ఏమి చేయనున్నారో చెప్పలేదు. దాంతో ప్రజలలో ఈ మూడు పార్టీల వల్ల ఉపయోగం లేదన్న భావన నెలకొంది. ఇది ఒక సమస్య అయితే ముస్లీం, క్రిస్టియన్ వర్గాలు బీజేపీని ఈసారి మరింత ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి.
ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని అమిత్-షా ఇప్పటికే ప్రకటించారు. దానిని చంద్రబాబు ఖండించే పరిస్థితి లేదు. కేంద్రం తీసుకు వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌పై కూడా మైనార్టీలు గుర్రుగా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా సాగాయి. చంద్రబాబు గతంలో పలుమార్లు ఈ అంశంపై బీజేపీని విమర్శించారు. ఇప్పుడు యుటర్న్ తీసుకుని సీఏఏని సమర్దించారు. ముస్లీం రిజర్వేషన్‌ల గురించి అటు, ఇటు కాకుండా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత చేసిన ప్రకటనను ఖండించలేకపోయారు. పైగా బీజేపీ నేతలు ఎన్‌డీఏ ఎజెండాకు కట్టుబడి చంద్రబాబు పని చేయాల్సిందేనని అంటున్నారు. అంటే దీని అర్దం ముస్లీం రిజర్వేషన్లను చంద్రబాబు కూడా వ్యతిరేకించాల్సిందేనని వారు భావిస్తున్నారు. దీనిపై నిర్దిష్ట హామీ ఇవ్వలేని దుస్తితిలో చంద్రబాబు ఉన్నారు. ఇది కూడా ముస్లీంలకు అసంతృప్తిగా ఉంది. గతంలో ట్రిపుల్ తలాఖ్ రద్దును కూడా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించి ప్రచారం చేశారు.
2019 ఎన్నికల సమయంలో ప్రదాని మోదీని టెర్రరిస్టు అనడమే కాకుండా మళ్లీ ఆయన గెలిస్తే మైనార్టీలకు ఓట్లు కూడా తీసేస్తారని హెచ్చరించారు. కాని ఇప్పుడు అన్నిటిలో తన వైఖరి మార్చేసుకుని బీజేపీని అంటకాగడానికి సిద్దం అయిపోయారు. ఈ నేపధ్య్ంలో ముస్లీం వర్గం అంతా దూరం అయితే తమకు ఘోర పరాజయం ఎదురవుతుందన్న భయం ఏర్పడింది. టీడీపీ నేతలు ఈ విషయాన్ని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో కూడా తమ వ్యాఖ్యలను చేస్తున్నారు. కనీసం ఏభై నియోజకవర్గాలలో ముస్లీంలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్తితిలో ఉన్నారని అంచనా. ఒక్కో నియోజకవర్గంలో ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ముస్లీం ఓటర్లు ఉన్నారట. కుప్పంలో సైతం ఆయనకు ఈ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడవచ్చు. అందుకే కుప్పంలో వారితో ప్రత్యేకించి సమావేశమై తాను బీజేపీతో పొత్తు కోరుకోలేదని అబద్దం ఆడారు. బీజేపీతో చంద్రబాబు పలుమార్లు దొంగాట ఆడారు.
1996, 1998 ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీగా అభివర్ణిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ప్రచారం చేశారు. తదుపరి 1998 ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమిలోకి దూకేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ తాను తప్పు చేశానని, జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని అన్నారు. అంతకుముందు గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని నరహంతకుడని ద్వజమెత్తారు. అయినా 2014 నాటికి మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బతిమలాడి, కాళ్లా-వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
2018 నాటికి మళ్లీ మోదీని దూషిస్తూ బయటకు వచ్చేశారు. బీజేపీ ఏపీకి ఏమీ చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిందని అన్నారు. తిరిగి 2024నాటికి బీజేపీ పెద్దలను ఎలా మేనేజ్ చేసుకున్నారో కాని, తిరిగి పొత్తు పెట్టుకున్నారు. అయినా ముస్లీంల మీటింగ్‌లో మాత్రమే అమిత్-షా నే ఏదో బతిమలాడినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసి అప్రతిష్టపాలయ్యారు. వెనకటికి ఒక సామెత ఉంది. ‘ఏడాది ఉతికినా ఎలుక తోక నలుపే’ అని అంటారు. అలాగే చంద్రబాబు కూడా తన పాత అలవాట్లను మార్చుకోలేరు ప్రతి దానికి యుటర్న్ తీసుకోవడం, అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. ఈసారి ముస్లీంలను మాయ చేయడానికి ప్రయత్నించారు కాని, అంతా బహిర్గతం అయిపోయింది. దీనివల్ల ఆయన ఎత్తుగడ పారలేదనే చెప్పాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment