తొలి రోజు 336 పరుగులు చేసిన తర్వాత కూడా జట్టు కాస్త అసంతృప్తికి గురి కావడం సాధారణంగా కనిపించదు... కానీ శుక్రవారం భారత్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చక్కగా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై తమకు లభించిన ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో శిఖరాన నిలిచాడు.
మైదానం నలుమూలలా చూడముచ్చటైన స్ట్రోక్‌లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్‌ను ప్రదర్శిస్తూ భారీ శతకం బాదాడు. మరో వైపు ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ఆనందంగా ఆటను ముగించింది. మిగిలింది బౌలర్లే కాబట్టే యశస్వి, అశ్విన్ జోడి రెండో రోజు భారత్ స్కోరును 400 వరకు తీసుకెళుతుందా లేక ఇంగ్లండ్ ఆలోపు నిలువరిస్తుందా చూడాలి.
విశాఖ స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజును భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ముగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ఆటతో ఒంటరి పోరాటం చేస్తూ ద్విశతకానికి చేరువయ్యాడు. యశస్వి మినహా మిగతా బ్యాటర్లంతా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం యశస్వితో పాటు అశ్విన్ (5 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు.
మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు...
భారత్ ఇన్నింగ్స్‌లో వరుసగా 40, 49, 90, 70, 52, 29 పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. చూస్తే మెరుగ్గానే అనిపిస్తున్నా... ఇందులో ఒక్కటీ భారీ భాగస్వామ్యంగా మారలేకపోయింది. ఒకే ఒక్కడు యశస్వి ఒంటి చేత్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా మిగతా బ్యాటర్ల స్కోర్లన్నీ 14నుంచి 34 పరుగుల మధ్య ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (14) తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అయితే 41 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయిన అతను లెగ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అరంగేట్ర బౌలర్ బషీర్ ఖాతాలో ఈ వికెట్ చేరింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. అయితే అండర్సన్ చక్కటి బంతికి అతను అవుటయ్యాడు. లంచ్ తర్వాత కుదురుకునేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 27; 3 ఫోర్లు) కూడా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం యశస్వికి రజత్ పటిదార్ (72 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఆపై అక్షర్ పటేల్ (51 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు.
టీ విరామ సమయానికి భారత్ స్కోరు 225/3. అయితే చివరి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. రేహన్ బౌలింగ్‌లో తన బ్యాట్‌ను తాకి వికెట్ల వైపు వెళుతున్న బంతిని ఆపడంలో విఫలమైన పటిదార్ పెవిలియన్ చేరాడు. అయితే ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు భారత్ అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ చెత్త షాట్‌తో వెనుదిరగ్గా...సొంత మైదానంలో సత్తా చాటేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కేఎస్ భరత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) వృథా చేసుకున్నాడు.
ఈ టెస్టు కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో పటిదార్, కుల్దీప్ యాదవ్ రాగా...సిరాజ్‌కు బదులు ముకేశ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడిన సిరాజ్‌కు విరామం ఇస్తూ జట్టునుంచి విడుదల చేశామని...అతను తర్వాతి టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.
జైస్వాల్ అలవోకగా...
రూట్ తొలి ఓవర్లో 2 ఫోర్లతో బౌండరీల ఖాతా తెరిచిన యశస్వి చివరి వరకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ అదే జోరును కొనసాగించాడు. బషీర్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన యశస్వి 89 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతడిని ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
హార్ట్‌లీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఆధిక్యం ప్రదర్శించిన భారత ఓపెనర్ కొద్ది సేపటికే కెరీర్‌లో రెండో శతకం (151 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్‌తో సెంచరీని అందుకోవడం విశేషం. యశస్వి చక్కటి షాట్లకు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో రేహన్ ఓవర్లో భారీ సిక్స్‌తో అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
ఇండోర్‌కు చెందిన రజత్ పటిదార్ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 310వ ఆటగాడిగా రజత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడిన 713వ క్రికెటర్‌గా నిలిచాడు.
స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 179; రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14; గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34; శ్రేయస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్‌లీ 27; రజత్ (బి) రేహన్ 32; అక్షర్ (సి) రేహన్ (బి) బషీర్ 27; భరత్ (సి) బషీర్ (బి) రేహన్ 17; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 336. వికెట్ల పతనం: 1–40, 2–89, 3–179, 4–249, 5–301, 6–330. బౌలింగ్: అండర్సన్ 17–3–30–1, రూట్ 14–0–71–0, హార్ట్‌లీ 18–2–74–1, బషీర్ 28–0–100–2, రేహన్ 16–2–61–2.
Comments
Please login to add a commentAdd a comment