Former MLA Bhikshamaiah Goud Sent His Resignation Letter To BJP, Details Inside - Sakshi
Sakshi News home page

‘ఆ విషయం బీజేపీలో చేరిన కొద్ది కాలానికి అర్థమైంది.. కేంద్రం ఆ కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది’

Published Thu, Oct 20 2022 6:27 PM | Last Updated on Thu, Oct 20 2022 7:22 PM

Former MLA Bhikshamaiah Goud Sent His Resignation Letter To BJP - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్‌. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 

‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి.

కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన‍్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్‌లోని డొల్లతనానికి అద్దం పడుతోంది.

గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి  చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్‌టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది.

హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు.

చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌. 
ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్‌.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement