Hyderabad Dinesh Ethical Hacker Payment Gateway Plat from - Sakshi
Sakshi News home page

దినేష్‌ దశ తిరిగెన్‌.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్‌ ఆఫర్‌ 

Published Sat, May 14 2022 7:23 AM

Hyderabad Dinesh Ethical Hacker Payment Gateway Plat from - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే అతడి చేతిలో ఉన్న ఉద్యోగం, ఇతర అవకాశాలు కోల్పోతాడు. అయితే నగరానికి చెందిన ‘పేమెంట్‌ గేట్‌ వే’ సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసి భారీ మొత్తం కాజేసిన కేసులో చిక్కిన వన్నం శ్రీరామ్‌ దినేష్‌ కుమార్‌ కథ వేరేలా ఉంది. ఈ హ్యాకర్‌ను తాము ఎథికల్‌ హ్యాకర్‌గా వినియోగించుకుంటామని బాధిత కంపెనీనే ముందుకు వచ్చింది. నగర పోలీసు అధికారులు సైతం ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. దినేష్‌ను అరెస్టు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడికి హ్యాకింగ్‌పై ఉన్న పట్టు, ప్రస్తుత అవసరాలను గమనించి మార్పు వచ్చేలా కౌన్సిలింగ్‌ చేశారు. ఫలితంగా ఎథికల్‌ హ్యాకర్‌గా మారడానికి దినేష్‌ అంగీకరించాడు.  

పరిస్థితులు వివరిస్తూ దినేష్‌కు కౌన్సిలింగ్‌... 
నగరానికి చెందిన పేమెంట్‌ గేట్‌ వే సంస్థ పేజీ సర్వర్‌ను గతేడాది నవంబర్‌ నుంచి రెండుసార్లు హ్యాకర్లు దాడి చేశారు. ఈ ఏడాది మార్చిలో దినేష్‌ చేసిన తాజా ఎటాక్‌ రెండోది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ తమ సైబర్‌ సెక్యూరిటీ, ఫైర్‌వాల్స్‌ పటిష్టం చేయడానికి కొన్ని సంస్థల సేవలతో ఒప్పందాలు చేసుకుంది. వీరి సర్వర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను అధ్యయనం చేసిన ఆయా సంస్థలు కొన్ని మార్పు చేర్పులు చేయడంతో ఇక భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్‌ ఉండవని భావించింది. అయిన్పప్పటికీ వాటిన్ని ఛేదించిన దినేష్‌ హ్యాకింగ్‌ చేశాడు. ఇతడిని అరెస్టు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విద్యార్హతలు లేకున్నా అతడికి హ్యాకింగ్, వల్నరబులిటీ టెస్టుల్లో ప్రావీణ్యాన్ని గుర్తించారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిభను సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దీంతో అతడిలో వచ్చిన పశ్చాత్తాపం, మార్పులను దర్యాప్తు అధికారులు గుర్తించారు.   

చదవండి: Hyderabad: గుడ్‌న్యూస్‌.. సిటీబస్సు @ 24/7

వారికి తెలియని లోపాలు బయటపెట్టడంతో..
ఈ నేపథ్యంలోనే అతడి ద్వారానే బాధిత సంస్థలో ఉన్న సాంకేతిక లోపాలను వారికి తెలియజేయాలని నిర్ణయించారు. దీంతో అతడిని విచారిస్తున్న సందర్భంలో పేజీ సంస్థ సాంకేతిక బృందాన్నీ సైబర్‌ ఠాణాకు పిలిచారు. వారి సమక్షంలోనే దినేష్‌ ఇప్పటికీ దాని సర్వర్, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న అనేక లోపాలను బయటపెట్టాడు. దీంతో కంగుతిన్న ఆ సంస్థ ఎథికల్‌ హ్యాకర్‌గా మారి తమ సర్వర్‌ను హ్యాకింగ్‌ ఫ్రూఫ్‌గా మార్చడానికి సహకరిస్తావా? అంటూ దినేష్‌ను కోరారు. అప్పటికే కౌన్సిలింగ్‌తో మారిన దినేష్‌ వెంటనే అంగీకరించాడు.

మరోపక్క ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరిగిపోతుండటంతో నగర పోలీసులు సైతం ప్రైవేట్‌ నిపుణులు, ఎథికల్‌ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. దినేష్‌ శైలిని గమనించిన ఓ ఉన్నతాధికారి ఇతడు ఆ నిపుణులకు ఏమాత్రం తక్కువ కాదని గుర్తించారు. దీంతో దినేష్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ సైబర్‌ నేరాల దర్యాప్తులో అతడి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. దినేష్‌ ఈ పనులు ప్రారంభిస్తే మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అనునిత్యం అతడి కార్యకలాపాలు, వ్యవహారశైలిపై నిఘా ఉంచనున్నామని తెలిపారు.  

కుటుంబ నేపథ్యమూ కారణమే... 
దినేష్‌ను ఎథికల్‌ హ్యాకర్‌గా మార్చాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు యోచించడానికి అతడి ప్రతిభతో పాటు కుటుంబ నేపథ్యమూ ఓ కారణమే. ఇతడి తండ్రి ఆర్టీసీ కండెక్టర్‌ కాగా, తల్లిది చిన్న స్థాయి రాజకీయ నేపథ్యం. దినేష్‌ భార్య ఏపీలోని గ్రామ సచివాలయంలో వ్యవసాయాధికారిణిగా పని చేస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్హతలు లేక ఉద్యోగాలు రాకపోవడం, పెట్టిన ప్రాజెక్టులు నష్టాలు మిగల్చడంతోనే దినేష్‌ నేరబాటపట్టినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement