వ్యాధుల అడ్డుకట్టకు కార్యాచరణ ఏదీ?
సమీక్ష నిర్వహించని వైద్య మంత్రి
కేవలం సూచనలతో సరిపెట్టిన యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: వానాకాలం అంటేనే సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకుంటే జనంపై వ్యాధులు పంజా విసురుతాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా సహా ఇతరత్రా వ్యాధులు సోకుతాయి. అయితే ఇప్పటివరకు ఆ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
జ్వరాలు సర్వసాధారణం...
సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పుతుంది. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు. అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్‌లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్‌లు తెరవాలి.
మలేరియా, డెంగీ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆస్పత్రులకు పంపాలి. డెంగీ వంటి జ్వరాల్లో ప్లేట్‌లెట్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్లు అందుబాటులో లేకుంటే పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్లేట్‌లెట్లు ఎక్కించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడతాయి. రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా, వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలూ జరపలేదు.
అధికారులూ అంతే...
అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రుల తనిఖీలు లేవు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులు సహా రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారులు బయట కాలుపెట్టడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా మంది వెళ్లడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్నా వాటి కన్నుగప్పి తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
వాతావరణ మార్పులతో వ్యాధుల ముప్పు
జాగ్రత్తలు సూచించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో ఉ ష్ణోగ్రతల తగ్గుదల, గాలిలో తేమ వంటి వాతావరణ మా ర్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని, అలాగే దోమలు, ఆహారం, నీటి ద్వారా వ్యాధుల వ్యాప్తి పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్, ఫ్యా మిలీ వెల్పేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ అ న్నారు. దోమల బెడద కారణంగా మలేరియా, డెంగీ, చికు న్‌గున్యా వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు.
వర్షాకాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కిటికీలకు దోమ తెరలు/ స్క్రీన్లు పెట్టుకోవాలని, దోమల సంతానోత్పత్తి సమయాలైన ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. దోమలు కుట్టకుండా క్రీములు, లోషన్లు వంటివి రాసుకోవాలని తెలిపారు. మురుగు కాల్వల్లో నీళ్లు నిలిచిపోకుండా చూడాలని, సెప్టిక్ ట్యాంకులను మెష్‌లతో కవర్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీ శుక్రవారం ఇంటి చుట్టూ నీళ్లు నిలిచిపోకుండా డ్రైడే నిర్వహించాలని, కాచి వాడబోసిన నీళ్లు, బయట ఉన్నపుడు బాటిల్డ్ వాటర్ తీసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment