సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్‌మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్‌కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్‌లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్‌మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు.
పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం..
నగరంలో ఒకప్పుడు పబ్స్‌కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్‌స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్‌కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు..
వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్యూజ్‌మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్‌సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్‌ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు.
పక్కా పరిశీలన తర్వాతే అనుమతి...
ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్‌కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్‌మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్‌కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్‌కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్‌లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు.
వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు..
► ఎమ్యూజ్‌మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్‌ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్‌మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment