చాలా చోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల మేర పెరుగుదల
రాష్ట్రంలో వేడెక్కిన వాతావరణం
నేటి నుంచి మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కూడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత నాలుగైదు రోజులుగా కాస్త చల్లబడ్డ గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ వేగంగా పెరిగాయి. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా ఉక్కపోత... పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 42.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.3 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3 డిగ్రీలు, నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడం గమనార్హం.
పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక శాఖ వాతావరణ పరిశీలన కేంద్రాల్లో నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలో ఇదే అత్యధికం. ఆ తర్వాత నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 43.8 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 43.8డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.3 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 43.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథనిలో 43.1 డిగ్రీలు, మహబూబా బాద్ జిల్లా మరిపెడలో 43.0 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేటి నుంచి మరింతగా
బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడుగా రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment