బిర్యానీలో బ్లేడు కలకలం
Breaking News
మోదీ వర్సెస్ దీదీ: భారీ హైడ్రామా.. ట్విస్టులు
Published on Sat, 05/29/2021 - 09:19
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య కోల్డ్‌వార్ రసవత్తరం. నిన్న తుపానుపై సమీక్ష సమావేశానికి దీదీ అర గంట ఆలస్యం. పావు గంటలోనే తిరుగుముఖం. దీదీ ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని బీజేపీ ఆరోపణ. గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కూడా గరం. సీఎస్‌ను వెనక్కి పంపించేయాంటూ ఆఘమేఘాల మీద ఆదేశాలతో కేంద్రం రివెంజ్!.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మమతా.. సీఎస్‌తో సహా ఉన్నతాధికారుల్ని కూడా ఉద్దేశ్యపూర్వకంగానే హాజరుకావొద్దని ఆదేశించినట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. నిజానికి నాలుగు రోజుల క్రితమే బందోపాధ్యాయ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించింది కేంద్రం. అయితే తాజా పరిణామాలతో ఆయన్ని వెనక్కి పిలిపించుకోవడంపై ప్రతీకార చర్యగానే మమత ప్రభుత్వం భావిస్తోంది.
దిగజారుడుతనమే!
సీఎస్‌ను వెనక్కి రావాలన్న కేంద్రం ఆదేశాలపై తృణముల్ ఎంపీ సుఖేందు తీవ్రంగా మండిపడ్డాడు. ‘స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇలా బలవంతంగా ప్రతీకార దేశాలు ఇవ్వడం ఏమిటి? మోదీ షాలు ఇంకెంత దిగజారుతారు. మమత సర్కార్‌కి ఇలాంటి ఆదేశాలిచ్చి ఈ ఇద్దరూ బెంగాల్ ప్రజలు ఘోరంగా అవమానించారు’ అని సుఖేందు వ్యాఖ్యానించాడు. కాగా, ఉన్నతాధికారులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఇదేం కొత్త కాదు. బెంగాల్ ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే అలపన్ బందోపాధ్యాయను రూల్స్ ప్రకారమే కేంద్రం వెనక్కి తీసుకుంటోందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోన్నెల్ అండ్ ట్రైనింగ్ తెలిపింది. ఐఎఎస్ కాడర్ రూల్స్‌లోని సెక్షన్ 6(1) ప్రకారం.. బందోపాధ్యాయను మే 31లోగా రిపోర్టింగ్ చేయాలని సంబంధిత విభాగంలోని ఓ అధికారి వెల్లడించాడు.
ఇలా వచ్చి, అలా..
కాగా, ఏరియల్ సర్వే కలైకుందా ఎయిర్‌బేస్‌లో సమీక్ష సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్‌లో ప్రధాని మోదీతో పాటు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగిన తర్వాత ప్రధాని, మమతా బెనర్జీ మధ్య సమావేశం తొలిసారి కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోగా, దీదీ కోసం అంతా 30 నిమిషాల పాటు వేచి చూశారని తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన మమతా వేరే కార్యక్రమాలు ఉన్నందున ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఆ తర్వాత యాస్ తుపాన్ నష్టంపై రిపోర్టులు సమర్పించి.. దిఘాలో జరిగే మీటింగ్ కోసం వెళ్లాలని చెప్పి పావుగంటలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మమతా ఆ సమావేశానికి హాజరుకాలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గరం.. గరం
ప్రధానితో సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు పట్ల బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగం, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారరు. ఇక మమతా బెనర్జీ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది. నియంతృత్వ స్వభావానికి ఇది పరాకాష్ట అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలిసి పనిచేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Mamata Didi’s conduct today is an unfortunate low. Cyclone Yaas has affected several common citizens and the need of the hour is to assist those affected. Sadly, Didi has put arrogance above public welfare and today’s petty behaviour reflects that.
— Amit Shah (@AmitShah) May 28, 2021
Tags