డిప్యూటీ సీఎం పవన్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు
Breaking News
చావు అంచున డీఎస్పీ.. చచ్చాక పరిహారం ఎందుకంటూ వీడియో
Published on Fri, 06/04/2021 - 10:55
పంజాబ్‌లో సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేసింది. నా ట్రీట్మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది.
ఛంఢీఘడ్: డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్ సింగ్‌కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎక్స్‌గ్రేషియాపై విమర్శలు
డిప్యూటీ జైలు సూపరిడెంట్‌గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు. ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు.
Grateful to Punjab CM @capt_amarinder for supporting the treatment of DSP Harjinder Singh, after his recovery from #COVID...1/2
— DGP Punjab Police (@DGPPunjabPolice) June 2, 2021
మూడువారాల తర్వాత..
ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్ సింగ్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్‌కు డిపార్ట్మెంట్ తరపున లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు.
చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు
Tags