నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
Published Tue, Feb 28 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
నిబంధనలు పాటించకుండా, లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కూడా వాస్తవానికి కాంట్రాక్ట్ క్యారియర్‌గానే వెళ్లాలి. అంటే బస్సు బయల్దేరిన చోట మాత్రమే మొత్తం ఎంతమంది ప్రయాణికులుంటే అందరినీ ఎక్కించుకుని, వారందరినీ గమ్యస్థానాల వద్ద దించాలి. అంతే తప్ప మధ్యదారిలో మాత్రం ఎవరినీ ఎక్కించుకోకూడదు. అలా ఎక్కించుకునేవాటిని స్టేజి క్యారియర్లు అంటారు. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కాంట్రాక్టు క్యారియర్. ఈ విషయాన్ని బస్సు రిజిస్ట్రేషన్ సమయంలోనే పేర్కొన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకున్నారు.
ప్రయాణించిన వారు ఇలా..
శ్రీకాకుళం-హైదరాబాద్ 15 మంది, విశాఖపట్నం -హైదరాబాద్ 14 మంది, విశాఖపట్నం - విజయవాడ ఒకరు, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ 9 మంది, భువనేశ్వర్ నుంచి విజయవాడ నలుగురు, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం ఒకరు, టెక్కలి నుంచి హైదరాబాద్ ముగ్గురు, టెక్కలి నుంచి విజయవాడ ఒకరు, బెర్హంపూర్ నుంచి హైదరాబాద్ ఇద్దరు చొప్పున టికెట్లు తీసుకున్నారు. మొత్తం 50 సీట్లు ఉండగా ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్నీ భర్తీ అయ్యాయి.
గతంలోనూ అతివేగం
ఇదే బస్సు ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటప్పుడు కూడా అతి వేగంగా, ప్రమాదకరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో జనవరి 12వ తేదీన ఇదే ఏపీ02టీసీ7146 నంబరు బస్సును.. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. అప్పుడు డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నట్లు గుర్తించి, అతడికి 2వేల రూపాయల జరిమానా విధించారు. డ్రైవర్ కూడా తాను తప్పు చేసినట్లు అంగీకరించి, జరిమానా చెల్లించాడు. ఈ విషయాన్ని కత్తిపూడి చెక్‌పోస్టులో పనిచేసిన అధికారి శ్రీకాంత్ బాబు ధ్రువీకరించారు.
Advertisement
Advertisement