ఆదాల బరిలోనుంచి తప్పుకో....
హైదరాబాద్ : కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డిని రాజ్యసభ బరిలోనుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదాల గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు. అయితే తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని సీఎంతో చెప్పినట్లు సమాచారం.
కాగా కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చి సమైక్యాంధ్ర నినాదంతో ఆదాలను గెలిపించుకోవాలనే ఆలోచనతో సీఎం కిరణ్ ఆయన్ను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆఫ్ ది రికార్డ్ మాటల్లో ఆదాల కూడా ఎమ్మెల్యేల వద్ద ఇదే విషయం చెబుతున్నారని వినికిడి. రకరకాల మార్గాల్లో తాను 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను సమీకరించుకుంటే మిగిలిన వారిని సీఎం కిరణే సర్దుబాటు చేసి తన విజయానికి బాటలు వేస్తారని ఆదాల గట్టిగా నమ్ముతున్నారు.
అయితే కాంగ్రెస్ హై ‘కమాండ్’ ఫలితంగా సీఎం కిరణ్ ఆదాలకు ఎమ్మెల్యేలను సమకూరుస్తారా? లేక తనను సీఎం చేసిన సోనియాగాంధీతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఉంటాయని చివరి నిముషంలో హ్యాండిస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అటు టీడీపీ నుంచి నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి తన ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, సీఎం ధైర్యంగా ఎమ్మెల్యేలను ఇవ్వలేకపోతే ఆదాల పరిస్థితి ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.