అమానుషం | Rape and murder of a girl | Sakshi
Sakshi News home page

అమానుషం

Published Fri, Jun 19 2015 1:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

అమానుషం - Sakshi

అమానుషం

‘అమ్మా.. స్కూల్ చాలా బాగుంది. నాకూ పుస్తకాలిస్తారంట. అవన్నీ చకచకా చదివేస్తాను’ అంటూ తొలిరోజు పాఠశాలకెళ్లి వచ్చిన ఆ చిన్నారి మురిపెంగా చెప్పిన మాటలు విని తల్లి మురిసిపోయింది. ‘నా తల్లే.. నువ్వు బాగా చదువుకోవాలి. ఆఫీసరవ్వాలి. మంచి పేరు తెచ్చుకోవాలి’ అంది. ఇంటికొచ్చిన భర్తకు ఈ విషయాలు చెప్పి సంబరపడగా, తండ్రి సైతం ఆనంద డోలికల్లో తేలియాడాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఆ చిన్నారి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు హతాశులయ్యారు. తమ ఎదురింట్లోనే ట్రంకు పెట్టెలో శవమై ఉందని తెలియక ఊరంతా వెతికారు. ప్రయోజనం లేకపోవడంలో పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులు గడిచింది. ఎదురింట్లోని ట్రంకు పెట్టె దుర్వాసన వెదజల్లింది. తెరిచి చూస్తే ఆ చిన్నారి మృతదేహం బయటపడింది. మానవ రూపంలోని మృగం ఆ చిన్నారిపై అత్యాచారం జరిపి.. ఆపై ప్రాణం తీసిందని తెలిసి ఊరు ఊరంతా నివ్వెరపోయింది. ఆగ్రహం కట్టలు తెంచుకోగా.. రోడ్డెక్కింది. ఏడేళ్ల చిన్నారి ఉసురు తీసిన మృగాడికి శాపనార్థాలు పెట్టింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపై విరుచుకుపడింది.
 
 ఏలూరు (సెంట్రల్) : అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యాచారం జరిపి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్న ఘటన కలకలం రేపింది. ఏలూరు మండలం వెంకటాపురం ఇందిరా కాలనీకి చెందిన తియ్యాల లావణ్య (7)పై ఎదురింట్లో ఉంటున్న జోనుగంటి సురేష్ అనే వ్యక్తి అమానుషానికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తియ్యాల రమేష్, అనురాధ దంపతుల కుమార్తె లావణ్య సోమవారం నాడు మాదేపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేరింది.
 
 ఇంటికి తిరిగొచ్చాక తొలిసారి పాఠశాలకు వెళ్లొచ్చిన ఆనందాన్ని తల్లితో పంచుకుంది. రెండో రోజైన మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన లావణ్య, తల్లి అనురాధ కలసి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి పచారి సామగ్రి కొన్నారు. కొనుగోలు చేసిన కోడిగుడ్లను దుకాణం వద్దే వదిలేసిన విషయం గుర్తు రాగా, లావణ్య వాటిని తెచ్చేందుకు వెనక్కి వెళ్లింది. ‘అమ్మా.. నువ్వు కూర వండ టం మొదలెట్టు. చిటికెలో కోడిగుడ్లు తెచ్చేస్తా’ అని వెళ్లిన లావణ్య  ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలిక తండ్రి రమేష్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 ముందే అనుమానించినా..
 లావణ్యను ఎదురింట్లో ఉంటున్న జోనుగంటి సురేష్ కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానించి బాలిక తల్లి అనురాధ తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని అతడిని బతిమాలింది. అవసరమైతే సొమ్ములు ఇస్తామని కూడా అనురాధ, ఆమె భర్త రమేష్ అతడికి చెప్పారు. అయినా ఆ కసాయి మనసు కరగలేదు. తమ కుమార్తె అదృశ్యానికి సురేష్ కారణమని బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు చెప్పారు. అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు అతడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని వదిలేశారు.
 
 అకృత్యం ఇలా బయటపడింది
 నిందితుడు సురేష్ ఇంట్లోని ట్రంకు పెట్టెనుంచి దుర్వాసన రావడంతో అతడి తండ్రి వెంకటేశ్వరరావు ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో లావణ్య మృతదేహం కనిపించింది. దీంతో అతడు చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు, లావణ్య బంధువులు రోడ్డెక్కారు. నిందితుడి వ్యవహారంపై ముందే సమాచారమిచ్చినా పట్టించుకోలేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. నిందితుడిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. సురేష్ కుటుం బ సభ్యులపైన, అతడి ఇంటిపైన దాడిచేశారు. సమీపంలో ఉన్న బంధువు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి అప్పటికే పలాయనం చిత్తగించాడు.
 
 సురేష్ గత చరిత్ర ఇదీ
 జోనుగంటి సురేష్ జులాయిగా తిరుగుతూ చోరీలకు పాల్పడుతుండేవాడు. పలు కేసుల్లో  జైలుశిక్ష  అనుభవించాడు. సుమారు ఆరు నెలల క్రితం సురేష్ తాగిన మైకంలో కన్న కూతురిపైనే అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, అది గమనించిన అతని భార్య పిల్లలను తీసుకుని రమేష్‌కు దూరంగా ఉంటోంది. సురేష్ గతంలో ఓ వికలాంగ యువకుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు స్థానికులు చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement