విస్తరణలో ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్ | Sakshi
Sakshi News home page

విస్తరణలో ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్

Published Sat, Sep 5 2015 1:01 AM

విస్తరణలో ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్

త్వరలో క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశం
- వీసీ కంపెనీ నుంచి రూ.30 కోట్ల ఫండ్
- ఎలీప్ ఎస్టేట్‌లో కొత్త ఫెసిలిటీ ఏర్పాటు
- ట్రాన్స్‌సెల్ సీఈవో సుభద్ర ద్రావిడ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
స్టెమ్ సెల్ (మూల కణాల) బ్యాంకింగ్, ప్రాసెసింగ్ సేవల రంగంలో ఉన్న ట్రాన్స్‌సెల్ బయోలాజిక్స్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఎలీప్ పారిశ్రామికవాడలో కొత్త ఫెసిలిటీని ఇటీవలే ప్రారంభించిన ఈ సంస్థ నూతన విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌తో పాటు డ్రగ్ డిస్కవరీ విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అడుగు పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు భారత్‌కు చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ముందుకొచ్చినట్లు ట్రాన్స్‌సెల్ సీఈవో సుభద్ర ద్రావిడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. రూ.30 కోట్లు పెట్టుబడికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అయితే ఎంత వాటా ఇచ్చేదీ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా ట్రాన్స్‌సెల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. మరో వెంచర్ క్యాపిటల్ సంస్త ఇప్పటికే రూ.2 కోట్లు సమకూర్చింది. అక్టోబరుకల్లా అదనంగా రూ.6 కోట్లను అందిస్తోంది.
 
సామర్థ్యం పెంపు...
హైదరాబాద్ సమీపంలోని ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్‌లో ట్రాన్‌సెల్ ఫెసిలిటీ ఉంది. సేకరించిన శాంపిళ్లను రెండుగా చేసి వేర్వేరు కేంద్రాల్లో భద్రపరుస్తారు. ఇందులో భాగంగానే ఎలీప్ ఎస్టేట్‌లో భారీ ఫెసిలిటీని కంపెనీ గత నెలలో ఏర్పాటు చేసింది. దీని సామర్థ్యం 15,000 శాంపిళ్లు. దీనిని మూడేళ్లలో 50,000 శాంపిళ్ల స్థాయికి తీసుకు వెళ్తామని సుభద్ర తెలిపారు. దంతాలు, అడిపోస్ టిష్యూ (కొవ్వు), బొడ్డు తాడు రక్తం, బొడ్డు తాడు కణం, ఎముక మజ్జ నుంచి మూల కణాలను సేకరించి భద్రపరిచే ఏకైక కంపెనీ తమదేనని ట్రాన్స్‌సెల్ చెబుతోంది. అడిపోస్ టిష్యూ నుంచి సేకరించిన మూల కణాలను కండరాల క్షీణత వ్యాధి చికిత్సలో వాడతారు. అలాగే మొహం, పొట్టపై ఉన్న మడతలు, మచ్చలు పోగొట్టేందుకు చేసే స్టెమ్ సెల్ థెరపీలోనూ ఉపయోగిస్తున్నారు. వక్షోజాల సైజు పెంచే చికిత్సల్లోనూ ప్రధానంగా వాడుతున్నారు. యూఎస్, రష్యాలో ఈ విధానం బాగా ప్రాచుర్యంలో ఉంది. పంటి లోపల ఉన్న గుజ్జు నుంచి సేకరించిన మూల కణాలను నరాల సంబంధ చికిత్సల్లో వాడుతున్నారు.
 
రూ.3,000 కోట్ల మార్కెట్...

మూల కణ బ్యాంకింగ్ (నిధి) మార్కెట్ ప్రస్తుతం భారత్‌లో సుమారు రూ.3,000 కోట్లుంది. ట్రాన్స్‌సెల్‌తోసహా ఆరు కంపెనీలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. 2017 నాటికి పరిశ్రమ రూ.5,000 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. 2003లో ఈ పరిశ్రమ పరిమాణం కేవలం రూ.100 కోట్లు. దీనిని బట్టి పరిశ్రమ వృద్ధి తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. మూల కణాలను భద్రపర్చుకోవాలన్న అవగాహన భారత్‌లో అంతకంతకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని సుభద్ర చెప్పారు. ఇక 70 రకాల వ్యాధులను నయం చేసేందుకు, నివారణకు మూల కణ ఆధారిత చికిత్సలు (స్టెమ్ సెల్ థెరపీ) ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పారు. ఇందులో భారత్‌లో మధుమేహం, క్యాన్సర్, పార్కిన్సన్స్, నరాల సంబంధ, ఆర్థరైటిస్ వంటి 10 రకాల వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది.

 
Advertisement
 
Advertisement