భారత్లో సంపన్నుల సంఖ్య 2 లక్షలు...
న్యూఢిల్లీ: అధిక నికర సంపద కలిగిన వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు) సంఖ్యా పరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో అతిపెద్ద దేశమని క్యాప్‌జెమిని అనే సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌లోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వద్ద 797 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు తెలిపింది. 2014లో భారత్‌లో వీరి సంఖ్య 1.8 లక్షలు ఉండగా గతేడాదికి ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగిందని... వీరి సంపద సైతం 1.6 శాతం వృద్ధి చెందినట్టు ‘ఆసియా-పసిఫిక్ వెల్త్ రిపోర్ట్ 2016’ పేరుతో విడుదల చేసిన నివేదికలో క్యాప్ జెమినీ సంస్థ పేర్కొంది.
2015లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్యా పరంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ వీరి సంఖ్య 27 లక్షలు. 10 లక్షలకు పైగా హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలతో చైనా రెండో స్థానంలో ఉండగా, 2.3 లక్షల మందితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా 2015లో ఈ ప్రాంతంలోని హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 9.9% వృద్ధితో 17.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇదే సమయంలో మిగిలిన ప్రపంచ దేశాల్లో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంపద 1.7 శాతమే వృద్ధి చెందినట్టు నివేదిక తెలిపింది.