క్షమాపణ కోరిన ఆర్బీఐ గవర్నర్
పుణే: భారతదేశం యొక్క వృద్ధి రేటు 'ఒంటి కన్ను రాజు' తో పోల్చిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని ఆయన కోరారు. తాను అలాంటి పోలిక చేసి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావాలను, ముఖ్యంగా అంధులను గాయపర్చినందుకు మన్నించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలా ఉండగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పేందుకు అలా మాట్లాడాననని రాజన్ తెలిపారు. తన వ్యాఖ్యలతో జనాభాలోని ఒక వర్గం(అంధులు) వారిని గాయపర్చినందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ , సహాయమంత్రి జయంత్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అలాంటి పదాలు వాడడం విచారకరమని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ షైనింగ్ స్టార్ లా ఉందంటూ రాజన్ వ్యాఖ్యలను జయంత్ సిన్హా తప్పుబట్టారు.