180 బిలియన్ డాలర్లకి రియల్టీ పరిశ్రమ!
నేషనల్ హౌసింగ్ బ్యాంక్
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ పరిశ్రమ 2020 నాటికి 180 బిలియన్ డాలర్లకి చేరుతుందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) అంచనా వేసింది. స్మార్ట్ సిటీల నిర్మాణం, రీట్స్‌కు పన్ను ప్రోత్సాహకాలు వంటి పలు అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా నిలుస్తాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పలు సంస్కరణల కారణంగా దేశీ రియల్టీ రంగం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటుందని, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తుందని ఎన్‌హెచ్‌బీ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో శ్రీరామ్ కల్యాణరామన్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు.
జీఎస్‌టీ బిల్లు అమలులోకి వస్తే.. వేర్‌హౌస్ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. రియల్టీ వృద్ధికి సమతుల్యంతో కూడిన నిబంధనలు సహా పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన చాలా అవసరమని సీబీఆర్‌ఈ చైర్మన్ (ఇండియా, దక్షిణ తూర్పు ఆసియా) అన్సుమన్ మేగజిన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగం సహకారం లేకుండా రియల్టీలో వృద్ధి కష్టసాధ్యమని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త రియల్టీ చట్టం.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి దోహదపడుతుంద ని సీఐఐ చైర్‌పర్సన్ రుమ్‌జుమ్ చటర్జీ తెలిపారు.