పుస్తకానికి ఉన్న అట్టలు రెండూ చెదిరిపోతే కాగితాలు కుదురుగా ఉంటాయా? గాలికి కొట్టుకుపోవూ! అట్టల్లా కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లల ముందు గొడవపడుతుంటే చిగురుటాకుల్లా పిల్లలు వణికిపోరా? పేరెంట్స్ మధ్య గొడవ చాలాసార్లు వారి బంధాలను బలపరచవచ్చేమోగానీ... పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలరా? ‘అమ్మా నాన్నా విడిపోతారా?మనం చెదిరిపోతామా?’.. ఏ ఇంటి చంటీ బంటీలకైనా ఇదే ఆందోళన.
పదేళ్ల బంటీ, ఎనిమిదేళ్ల చంటీ అన్నాచెల్లెళ్లు. వాళ్లిద్దరూ మూడు నాలుగు గంటల్నుంచి కనపడకుండా పోయారు. అప్పటికే కొన్ని గొడవల్లో ఉన్న వాళ్ల పేరెంట్స్‌కు ఇదో అశనిపాతం. పక్కింట్లోనూ, పిల్లల స్నేహితుల ఇళ్లలోనూ వాకబు చేసి, వాళ్లు అక్కడికి రాలేదని కన్‌ఫర్మ్ అయ్యాక... ఆందోళనగా, హడావుడిగా పోలిస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కంప్లయింట్ ఇచ్చి... తామూ వెతకడానికి పూనుకున్నారు. ఎందుకో తండ్రి సుధాకర్‌కు డౌట్ వచ్చి బస్‌స్టాండ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఒక ప్లాట్‌ఫారమ్ మీద బిక్కుబిక్కుమంటూ చంటీ, బంటీ! అప్పటివరకూ ఉన్న భారమంతా ఒక్కసారిగా తొలగిపోయినట్లు అయినట్లు అనిపించింది. కానీ అంతలోనే మళ్లీ ఆందోళన. పిల్లలు తల్లిదండ్రులతో ’ఇంటికి రానేరాం’ అన్నారు. సమూదాయించి తీసుకొచ్చాక కూడా సరిగా నిద్రపోలేదు. ఎలాగో నిద్రపట్టాక మళ్లీ ఉలిక్కిపడి లేస్తున్నారు. రెండు మూడు రోజులు ఇదే తంతు. పేరెంట్స్ ఇద్దరూ ఆందోళనతో పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్లిద్దరితోనూ మాట్లాడాక సైకియాట్రిస్ట్ అప్పుడు తల్లిదండ్రుల వైపునకు తిరిగి... ‘పిల్లలు వెళ్లిపోయిన రోజు ఏం జరిగింది?’ అంటూ అడిగాడు. ఆరోజు జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు సుధాకర్, అనుపమ.
ఆనాడు ఏం జరిగిందంటే...‘‘ఎంత డబ్బని తగలేస్తారిలా’’ అరుస్తోంది అనుపమ.‘‘మాటలు తిన్నగా రానియ్. తగలేయడమేంటి? డబ్బులు పంపింది నా పేరెంట్స్‌కి’’ సుధాకర్ గొంతూ గట్టిగానే ఉంది. ‘‘అదే.. అస్తమానమూ మీరే ఎందుకు పంపాలి? మీరొక్కరనే కొడుకు? మీకో అన్న, తమ్ముడూ ఉన్నారుగా. వాళ్లకు లేదా బాధ్యత’’ భర్తకు ఎదురెళ్లి మాట్లాడుతోంది నరాలు చిట్లేంత ఆవేశంతో!‘‘నా బాధ్యత నాది.. పంపొద్దని చెప్పడానికి నువ్వెరివి?’’ భార్యను కొట్టడానికి వెళ్తాడా అన్నంత కోపంగా అతను. ‘‘ఏమన్నారు.. నేనెవర్నా’’ ఆమె అహం దెబ్బతిన్నది. ‘‘అవును.. నన్ను ఆపడానికి ను..వ్వు.. ఎ..వ..రి..వి’’ ఒత్తి పలుకుతూ అతను. ‘‘ఛీ.. ఇంత మాట అనిపించుకున్న ఈ బతుకు అవసరమా. ఇంకా ఈ భార్యాభర్తల బంధం ఎందుకు?’’ నిలదీసింది.‘‘అయితే డైవోర్స్ ఇచ్చేయ్’’ అన్నాడు.గంట నుంచి ఈ గోలంతా వింటున్న, చూస్తున్న పిల్లలిద్దరు కూడా షాక్ అయ్యారు. తేరుకున్న అనుపమ బెడ్‌రూమ్‌లోకెళ్లి తలుపేసుకుంది. అతను విసురుగా బయటకు వెళ్లిపోయాడు. ‘‘అన్నయ్యా.. అమ్మానాన్నా విడిపోతారా?’’ వెక్కిళ్ల మధ్య అడిగింది ఎనిమిదేళ్ల చంటి. ‘‘ఏమో చెల్లీ’’ అయోమయంగా చెప్పాడు పదేళ్ల బంటి. ‘‘నాకు భయంగా ఉందిరా అన్నయ్యా’’ అదే వెక్కిళ్లతో చంటి. గత కొద్ది రోజులుగా అమ్మానాన్న గొడవలను చూస్తున్నారు. ఈ రోజు తారస్థాయికి చేరుకున్నట్టు అర్థమైంది ఆ పిల్లలను. అభద్రత నిలువనీయడం లేదు వాళ్లను. ఇంట్లో నుంచి పారిపోయి అమ్మమ్మ దగ్గరకు వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. కాని ఆ పని వల్ల వాళ్లు ప్రమాదంలో పడవచ్చు. పిల్లల ముందు తగువులాడుకునే పెద్దలు ఇవి ఆలోచిస్తారా?
అటు బెడ్‌రూమ్‌లో ఉన్న అనుపమ పరిస్థితీ ఇంచుమించు ఇదే. ఇలాంటి వాడికోసమా తన వాళ్లందరినీ వదులుకొని వచ్చింది? ఈ రోజు నువ్వెవరు అని అడుగుతున్నాడు.. పైగా డైవోర్స్ కూడా ఇవ్వాలట? దేవుడా ఈ సిట్యుయేషన్ ఎక్కడికి వెళ్తుంది? నేను, నా పిల్లలు ఏమై పోవాలి?’’ భయం ఆమెను వణికిస్తోంది.బయటకెళ్లిన అతని మానసిక స్థితీ అదే. కోపంలో.. ఆవేశంలో నోరు జారాడు. తనెలా రియాక్ట్ అవుతుందో? నిజంగానే నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతుందా? అమ్మానాన్న రెస్పాన్స్‌బులిటీ నేనొక్కడినే తీసుకుంటే తప్పేంటి? వీళ్లనైతే నిర్లక్ష్యం చేయట్లేదు కదా? ఈ మాత్రం అర్థంచేసుకోలేదా? సహనం నశించి ఒక్క మాటన్నాడు. భగవంతుడా.. అనుపమ నన్ను విదిలేస్తే.. అమ్మో ఆ ఊహనే తట్టుకోలేకపోతున్నాడు. బాధ, భయం, ఆందోళన అతనిని ఉండనివ్వట్లేదు. ఇది ఒక రకం యాంగై్జటీ. చంటి, బంటీ అనుభవిస్తున్న ఆ మానసిక పరిస్థితిని ‘అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ’ అంటారు. తమకు ఇష్టంలేకపోయినా ఏదైనా కారణాల వల్ల జీవిత భాగస్వామిని వదులుకోవాల్సి వచ్చే పరిస్థితితో పెద్దలు కూడా ఈ తరహా అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్‌కు గురవుతారు. అయితే కేస్‌స్టడీలో పేర్కొన్న ఉదాహరణలోని సంఘటనలో మాత్రమే కాదు... ఇతరత్రా ఎలాంటి సందర్భాల్లోనైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ విధమైన యాంగై్జటీకి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటిప్పుడు అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ కి కారణమైన సంఘటనను బట్టి కౌన్సెలింగ్‌తో పాటు చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి.
కొన్నిసార్లు శారీరక సమస్యలు
కొంతమందిలో యాంగై్జటీ కారణంగా కడుపులోని జీర్ణస్రావాలు ఎక్కువగా స్రవిస్తూ కడుపు కండరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో స్టమక్ అల్సర్స్ వస్తాయి. అలా పిల్లల్లో కడుపునొప్పులు తరచూ కనిపిస్తాయి.
యాంగై్జటీతో దురలవాట్లు తమలోని యాంగై్జటీని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు సిగరెట్, మరికొందరు మద్యం వంటి దురలవాట్లను ఆశ్రయిస్తుంటారు. వాటివల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలుగుతున్న భ్రాంతితో ఆ దురలవాట్లలో కూరుకుపోయి జీవితాలను నాశనం చేసుకున్న కేసులు ఎన్నో.
చికిత్స పిల్లలకు...
పిల్లలు చాలా సున్నిత మనస్కులు. వారి హృదయాలు తేలిగ్గా గాయపడతాయి. అందుకే అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అనే కండిషన్‌కు గురైన పిల్లలకు మొదట తల్లిదండ్రులు కల్పించాల్సింది భరోసా. తాము ఎప్పటికీ కలిసే ఉంటామన్న విశ్వాసాన్ని పిల్లల్లో పాదుగొలపాలి.
∙ పిల్లలకు సైతం నిత్యం వారితో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగవనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కల్పించడం ఎంతో అవసరం ∙పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని భర్తీ చేయాలి
పెద్దలకు...
తల్లిదండ్రులకు మొదట ఫ్యామిలీ కౌన్సెలింగ్ థెరపీ అవసరమవుతుంది.
∙పిల్లల ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ గొడవలు పడకూడదనే విధంగా పెరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
∙ కుటుంబ సభ్యులందరూ ఎదుర్కొన్న పరిస్థితులను పేరెంట్‌సకు ఉదాహరణగా చూపుతూ పిల్లలు పడిన మానసిక క్లేశాన్ని వారికి వివరించాలి. ఒకవేళ గొడవలు తీవ్రంగా ముదిరి నిజంగానే విడిపోయవాల్సి వస్తే పిల్లలకు కలిగే దురవస్థను వారికి వివరించడం ద్వారా ఆ స్థితి రాకుండా నివారించవచ్చు. అలా కుటుంబంలోని అందరి మానసిక వేదనను తొలగించడం సాధ్యమే. ్డ
కారణాలు : భార్యాభర్తల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలలో సమస్యలు (రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్) వంటివి పిల్లల్లో, పెద్దల్లో ఈ తరహా యాంగై్జటీకి కారణమవుతాయి. రకాల యాంగై్జటీకి ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశం. దంపతుల్లో ఒకరు చేసింది మరొకరికి నచ్చకపోవడంతో పాటు భార్యభర్తల్లో తాము పనిచేసే చోట కనిపించే ఒత్తిళ్లు, కార్యక్షేత్రంలో ఇబ్బందులు, ఒడిదొడుకులు, బంధువుల్లో తగాదాలు ఇవన్నీ ఈ రకం డిజార్డర్‌కు, తద్వారా వారిలోని యాంగై్జటీకి కారణమవుతాయి.
లక్షణాలు : అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ తో బాధపడే పిల్లల్లో ఈ తరహా లక్షణాలు కనిపించవచ్చు అవి... ∙పిల్లలు ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనతో ఉండటం ∙సంతోషంగా ఉండాల్సినప్పుడూ ఆ సంతోషం కనిపించకపోవడం ∙స్థిమితంగా ఉండేలేకపోవడం ∙అరచేతులు, అరికాళ్లలో చెమటలు పట్టడం ∙తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుండటం ∙నిద్ర సరిగా ఉండదు, ఈ తరహా లక్షణాలు కనిపించడానికి దాదాపు మూడు నెలల ముందు పిల్లలుగానీ లేదా పెద్దవాళ్లుగానీ అడ్జెస్ట్‌మెంట్ డిజార్డర్‌కు గురయ్యేంతగా తీవ్రస్థాయి ఒత్తిడికి గురై ఉంటారు. దాన్ని బట్టి పిల్లల్లోగానీ లేదా పెద్దల్లో గాని ఈ తరహా యాంగై్జటీకి గురయ్యారని నిర్ధారణ చేయవచ్చు.
సూచనలు : కుటుంబాల్లో దంపతుల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉండనే ఉంటాయి. ఒక్కోసారి అవే ముదిరి తీవ్రస్థాయి వాగ్వాదాలుగా మారడం చాలా సహజం. అందుకే దంపతుల్లో ఆవేశాలు పెచ్చరిల్లినప్పుడు, వాగ్వాదాలు ముదురుతున్నప్పుడు పిల్లల ముందు వాటిని వ్యక్తపరచకూడదు. వాళ్ల పరోక్షంలోనే విషయాలు మాట్లాడుకోవడం మంచిది. అలాగని వాళ్లు లేనప్పుడు గొడవపడాలని కాదు. ఆవేశం క్షణికమనీ... కొద్దిసేపటి తర్వాత అది తగ్గుతుందని గ్రహించి, కాసింత సేపు గడువిచ్చి మాట్లాడుకుంటే... తల్లిదండ్రుల మధ్యా టెన్షన్ తొలగుతుంది. పిల్లలకూ ఆందోళన తప్పుతుంది.
– డాక్టర్ పద్మ పాల్వాయి
సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment