మునిగిపోయే గొప్ప ఓడ కాదు, గమ్యం చేర్చే చిన్న దోనె చాలు | Not a great ship sinking, put a small dongle in the destination | Sakshi
Sakshi News home page

మునిగిపోయే గొప్ప ఓడ కాదు, గమ్యం చేర్చే చిన్న దోనె చాలు

Published Sun, Jun 10 2018 12:38 AM | Last Updated on Sun, Jun 10 2018 12:38 AM

Not a great ship sinking, put a small dongle in the destination - Sakshi

ఆనాటి యూదుమత ప్రముఖుడొకాయన యేసుప్రభువు వద్దకొచ్చి నేను నిన్ను వెంబడిస్తాను, నీవెక్కడికెళ్లితే అక్కడికొస్తానన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్లున్నాయి, కానీ తనకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ప్రభువాయనకు జవాబిచ్చాడు(మత్తయి 8:20). ఆయన ఏర్పర్చుకొన్న 12 మంది శిష్యులతో సహా ఎంతో మంది ప్రభువును అప్పటికే వెంబడిస్తున్నారు. అప్పటికి మూడేళ్ళుగా యేసు తన వాళ్ళతో కలిసి ప్రతిరాత్రి ఎక్కడో ఒక చోట బస చేస్తూనే ఉన్నాడు, రాత్రి పూట ఎక్కడో ఒకచోట తలవాల్చుతూనే ఉన్నాడు. మరి అతనితో ఈ మాటెందుకు అన్నాడు? ఆయన తన పేదరికాన్ని ప్రకటించుకొంటున్నాడా? ’భూమియు దాని సంపూర్ణతయు, లోకమును అందులో  నివాసం చేసేవన్నీ ఆయనవే’ అంటుంది బైబిల్‌(కీర్తనలు 24:1). విశ్వమంతా తనదే అయినా యేసుప్రభువు ఈ లోకంలో జీవించిన ముప్పైమూడున్నరేళ్లలో తన పరలోకపు తండ్రి అభీష్టం మేరకు దైవత్వాన్ని సంతోషంగా  పరిత్యజించి దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు. సకల భోగభాగ్యాలతో రాజప్రసాదంలో అనుభవిస్తున్న అత్యంత విలాసవంతమైన జీవితాన్ని వదిలి మారువేషంలో(లేదా మహిమశరీరం వదిలి మానవ శరీరంలో) తన ప్రజలతో కొంతకాలం సహజీవనం చేసేందుకు పూనుకొన్న మహాచక్రవర్తి ఆయన. ఈ దశలో ఆయనకంటూ సొంత ఆస్తులేవీ లేవు, ఉండవు కూడా. ఆపదలో సాయాన్ని, రుగ్మతలో స్వస్థతనిస్తూ, పడిపోయినపుడు పైకిలేపే స్నేహితుడిగా, కన్నీళ్లు, కష్టాల్లో ఓదార్చే సొంత మనిషిగా ఆయన దీనులు, నిరుపేదల కోసం నిరంతరం శ్రమించాడు. అంటే ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చి, వారితోనే వాళ్ళే తన సర్వంగా జీవించి ఏమీ లేని వారికి ఆయన ‘కొండంత అండ’ అయ్యాడు, వారి జీవితాల్లోనుండి విడదీయలేని భాగమయ్యాడు, వారి ’సొంత మనిషి లేదా సొంత ఆస్తి’గా మారాడు. తలవాల్చుకొనేందుకు కూడా తనకంటూ ఒక సొంత స్థలం లేనివాడే కాని అప్పుడూ ఇప్పుడూ కోట్లాదిమందికి యేసుప్రభువు ఆశ్రయదుర్గమయ్యాడు.

ఈ రోజుల్లోలాగే, ఆ రోజుల్లో కూడా మతసంబంధమైన వ్యక్తులే అత్యంత ధనవంతులు. ఎంతో ఆస్థిపరుడైన ఒక శాస్త్రి తనను వెంబడిస్తానన్నపుడు అందుకే యేసుప్రభువు అతన్ని నిరాశపర్చే జవాబిచ్చాడు. నన్ను వెంబడించి నీవు కొత్తగా సంపాదించుకునేదేమీ ఉండదు సరికదా నీకిపుడున్నదంతా వదిలేయాల్సి వస్తుందని ప్రభువు అతనితో పరోక్షంగా అన్నాడు. ఊహించినట్టే అతను జడిసి వెనుదిరిగాడు. ఆస్తులు, విలాసాలు పొందే అవకాశం లేదనుకుంటే ఈనాటి చాలామంది బోధకులు కూడా అతని లాగే ప్రభువును వదిలేస్తారు. ఆస్తులు కాదు, మహిమైశ్వర్యవంతుడైన యేసే మాకు ’తిరుగులేని స్థిరాస్తి’ ఆనుకున్న ఇతర అనుచరులు మాత్రం ఆయన జీవనశైలినే అనుకరిస్తూ ఆయన్ను వెంబడించారు, అద్భుతమైన పరిచర్య చేశారు, పరలోకంలో ఆయనకు పాలిభాగస్థులయ్యారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ ఓడను ఐర్లాండ్‌ లోని బెల్ఫాస్ట్‌లో అక్కడి చేయితిరిగిన 16 మంది మెకానిక్‌ల సారధ్యంలో నిర్మించారు. వారి నైపుణ్యాన్ని మెచ్చి ఆ 16 మంది మెకానిక్లను ఓడ యజమాని ఫ్రీ టికెట్లిచ్చి తీసుకెళ్తుండగా ఓడతోపాటే వాళ్లంతా మునిగి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ 16  మంది కుటుంబాల ఓదార్పు కోసం బెల్ఫాస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో జరిగిన  గొప్ప సంస్మరణ సభలో ‘మునిగిపోని పడవ’ అనే అంశంతో ఒక దైవజనుడు ప్రసంగించాడు. భయంకరమైన తుఫానులో కూడా తిబెరియా సముద్రంలో యేసుప్రభువున్న ఒక చిన్న పడవ మునిగిపోలేదు. యేసులేని జీవితం ఎంత గొప్పదైనా అది మునిగే ఓడేనని, యేసే ఉంటే చిన్న దోనెలాంటి జీవితమైనా అది పెనుతుఫానులను కూడా జయిస్తుందని ఆయన వివరిస్తే ఆ రోజున ఆ మెకానిక్‌ల పిల్లలు చాలామంది ప్రభువు పరిచర్యకు తమ జీవితాలు అంకితం చేసుకున్నారు. యేసు ఉన్న మునిగిపోని ఓడలుగా వాళ్ళు తమ జీవితాలను నిర్మించుకోవడమే కాక, మరెన్నో వందల జీవితాలను అలా వాళ్ళు ప్రభువులో నిర్మించారు. అలా ఒక పెను విషాదంలో ఆనంద కెరటం ఎగిసిపడింది. ’యేసుప్రభువే నా నిజమైన ఆస్తి’ అని సగర్వంగా ప్రకటించుకోవడమే సజీవ క్రైస్తవం. ఆస్తులు, డబ్బు చుట్టూ తిరిగే క్రైస్తవం, పరిచర్య ఎన్ని హంగులు, ఆర్భాటాలున్నా మృతప్రాయమైనదే, ఒకనాడు మునిగిపోయేదే!!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement