సమ్మరమే
సినిమాకి హీరో దేవుడంతటివాడు... కాదు... దేవుడే!
హీరోని ఏ వరం అడిగినా ‘ఓకే టేకిట్’ అంటాడు బోళాశంకరుడిలా!
అందుకే అతగాడు హీరో.
ఈ ఎండాకాలంలో హీరోని ఇండస్ట్రీ ఏమి అడుగుతుంది?
చల్లని హిట్ ఇవ్వు స్వామీ అని వేడుకుంటుంది. ఇస్తారా?
ఇవ్వకపోతే సమ్మర్‌లో మాడి మసైపోతుంది ఇండస్ట్రీ.
దట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అవర్ హీరో ఈజ్ ఫేసింగ్!
ఈ సమ్మర్‌లో హీరోగారు సప్తసముద్రాలు దాటి
విలన్‌ని పంచ్‌లు కొట్టి, హీరోయిన్ మీద పంచ్‌లు విసిరి,
సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ టైమ్‌ని పటాపంచ్‌లు చేసి హిట్ కొడతాడా?
అన్నదే క్లైమాక్స్ సీన్.
150 కోట్ల లాసులు... 500 కోట్ల స్టేకులు... 8 వీక్స్ టైము... దేఏఏఏవుడా!
ఇరవై సినిమాలు... 500 కోట్లు... కేవలం అరవై రోజులు!!
మే నెల సెకండాఫ్ నుంచి జూలై ఫస్టాఫ్ దాకా రెండు నెలల కాలంలో వచ్చే సినిమాల రిజల్ట్‌తో ఇండస్ట్రీ భవిష్యత్తు ముడిపడి ఉంది. బాలకృష్ణ ‘లయన్’ మొదలు గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ దాకా పదుల కోట్ల పెట్టుబడితో, ప్రతిష్ఠాత్మకంగా తయారైన అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మీడియమ్ రేంజ్ సినిమాలు సహా 20 కొత్త చిత్రాలు పలకరించనున్నాయి. ఒక్కముక్కలో పణంగా ఒడ్డుతున్న 500 కోట్ల సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ వసూళ్ళ వర్షం కోసం ఎదురుచూస్తోంది.
సక్సెస్ దాహార్తిలో సినిమా
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తెలుగులో ‘యూనివర్సల్ హిట్స్’ ఎన్ని అంటే, వెతుక్కోవాల్సి వస్తోంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాలు మూడింటికీ తృప్తినిచ్చిన సినిమాగా కల్యాణరామ్ ‘పటాస్’ రీజనబుల్‌గా పే చేసింది. డబ్బింగ్‌ల సంగతికొస్తే - కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ఇటీవలి లారెన్స్ ‘గంగ’ డబ్బులు తెచ్చాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ‘‘గత డిసెంబర్‌లో వచ్చిన రజనీకాంత్ ‘లింగ’ నుంచి వరుస ఫ్లాపులే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అతను డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన ఫైనాన్షియర్ - ఇలా అందరూ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కష్టాల్లో ఉన్నారు. ఒక్క మాటలో తెలుగు సినిమా ‘ఫైనాన్షియల్ స్లంప్’లో ఉంది. ఇండస్ట్రీకిప్పుడు మంచి హిట్ రూపంలో టానిక్ కావా’’లని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు వ్యాఖ్యానించారు.
ఫస్టాఫ్‌లో... గత ఏడాదే బెటర్!
లాస్ట్ ఇయర్ ఫస్ట్‌హాఫ్ ఇంత దారుణంగా లేదు. మహేశ్‌బాబు ‘1’ లాంటివి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ‘లెజెండ్’, ‘రేసుగుర్రం’ లాంటి బాక్సాఫీస్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడింది. ‘‘ఫ్లాపులొచ్చినా, కొన్ని సూపర్‌హిట్లు, కొన్ని సక్సెస్‌లతో గత ఏడాదే బ్యాలెన్స్ అయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా రూ. 125 కోట్ల పైగా నష్టపోయాం. పరిశ్రమ బ్యాడ్‌షేప్‌లో ఉంది’’ అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు.
అందుకే, టాలీవుడ్‌కి ఇది చాలా క్లిష్టమైన కాలం. రానున్న రెండు నెలల్లో సగటున ప్రతి పది రోజులకూ ఒక భారీ చిత్రం రానుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న డిఫరెంట్ జానర్ చిత్రాలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ మీద ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి.
అందరి కళ్ళూ అటువైపే!
ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి, ఇంకా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, ఈ చిత్రాల నిర్మాణ వ్యయం, వ్యాపారం వగైరా గురించి ఎవరూ కచ్చితమైన గణాంకాలు చెప్పలేకపోతున్నారు. అయితే, సినీవ్యాపార వర్గాల అంచనా ప్రకారం కేవలం ఈ రెండు సినిమాల మీదే దాదాపు రూ. 200 నుంచి 260 కోట్ల పైచిలుకు సొమ్మును పణంగా ఒడ్డుతున్నారు. ‘‘ఒక సగటు భారీ తెలుగు సినిమాకయ్యే ఖర్చు కన్నా రెట్టింపు వ్యయంతో ‘బాహుబలి’ తయారవుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీదే వంద కోట్ల పైగా స్టేక్ ఉంటుంది’’ అని సినీ వ్యాపారంలో మూడు దశాబ్దాల పైచిలుకు అనుభవజ్ఞుడు ఒకరు వివరించారు. అలాగే, కాకతీయ వీరనారి రుద్రమదేవి చారిత్రక గాథ ఆధారంగా గుణశేఖర్ తీస్తున్న తొలి తెలుగు స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ కూడా 60 కోట్ల పైచిలుకు పెద్ద పందెం. ఇక, మహేశ్‌బాబు, రవితేజ, రామ్, కల్యాణరామ్ లాంటి పేరున్న హీరోలు, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ అరవై రోజుల సినీ మారథాన్‌లో కీ-ప్లేయర్స్. అందుకే, ఏలూరుకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్. అన్నట్లు, ‘‘ఈ రెండు నెలల్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రాలు అటు ప్రేక్షకులకూ, ఇటు పరిశ్రమకూ కొత్త ఎనర్జీని ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతుంది.’’ అది ‘లయన్’తో మొదలవుతుందనీ, వరుస హిట్లతో ఈ రెండు నెలల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనీ పరిశ్రమ వర్గీయుల ఆశ. స్పెక్యులేటివ్ బిజినెస్ అయిన సినిమా పయనించేది ఎప్పుడూ ఇలాంటి ఆశల గుర్రం మీదే కదా!
- రెంటాల జయదేవ
హై స్టేక్స్ బాక్సాఫీస్ జూదం
పెట్టినఖర్చు, చేస్తున్న వ్యాపారం, ప్రింట్స్, పబ్లిసిటీ కలుపుకొని, పరిశ్రమ భారీగా పణం ఒడ్డుతున్న చిత్రాల్లో కొన్ని...
బాహుబలి: *150 - 200 కోట్లు (అన్ని భాషల్లో కలిపి) (జూలై 10న)
రుద్రమదేవి: *60 కోట్లు (జూన్)
మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’: 60 కోట్లు (జూలై 17 రిలీజ్)
లయన్: *35 కోట్లు (మే 14)
రవితేజ ‘కిక్2’: *45 కోట్లు (జూన్)
రామ్ ‘పండగ చేస్కో’: 22-25 కోట్లు (మే 29)
కల్యాణ్‌రాం ‘షేర్’: *20 కోట్లు (జూన్)
చార్మి ‘జ్యోతిలక్ష్మీ’: *12 కోట్లు (జూన్)
సందీప్ కిషన్ ‘టైగర్’: *7.5 కోట్లు (మే 22)
అల్లరి నరేశ్ ‘జేమ్స్‌బాండ్’: *8-10 కోట్లు (జూన్)
మోసగాళ్ళకు మోసగాడు: *6-7 కోట్లు (మే 22)
సూర్య ‘రాక్షసుడు’: *14 కోట్లు (మే చివర)
నాగశౌర్య ‘జాదూగాడు’: *4 కోట్లు (జూన్)
ఈ అంకెలన్నీ సినీ వ్యాపార వర్గాల భోగట్టా
సెలవుల సీజన్ వేస్ట్ చేశారు!
‘‘ఇవాళ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేక, ఈ వేసవి సెలవుల సీజన్‌ను చాలా వృథా చేశారు. తీరా వేసవి సెలవులైపోతుండగా, ఇప్పుడు పెద్ద సినిమాల సీజన్ మొదలవుతోంది. ఈ సినిమాల విజయం మీదే కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉంది.’’
- సత్య రంగయ్య, ప్రముఖ సినీ ఫైనాన్షియర్
ఎవరి దగ్గరా డబ్బులు లేవు!
‘‘ఈ ఏడాది ఇప్పటి దాకా డిజప్పాయింట్‌మెంటే! ఓవర్ బడ్జెట్ వల్లే ఫ్లాపవుతు న్నాయి. ఎగ్జిబిటర్స్ డబ్బుల్లేక, ఫుల్ పేమెంట్ చేయడం లేదు. దాని మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టడం లేదు. దాంతో ప్రతి రిలీజ్‌కూ కష్టమే.’’
- తేజ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, దర్శక, నిర్మాత