వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి.
క్యారట్ దద్ధ్యోదనం
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్‌మిస్ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత
పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను
తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్‌మిస్ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్‌మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి.
ఉసిరి రైస్
కావలసినవి
బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్ సిద్ధం చేసుకుంటే సరి.
డ్రై ఫ్రూట్స్ క్షీరాన్నం
కావలసినవి
బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు – 4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్‌మిస్ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు
తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి.
నేతి బీరకాయ బజ్జీ
కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి.
బిసిబేళ బాత్
కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను
పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment