టీ బంకుల్లో కలర్‌ఫుల్ లైబ్రరీలు!
భారతదేశం గొప్పతనాన్ని వర్ణించడానికి ఈ దేశానికి ఎన్ని మంచి లక్షణాలున్నాయో... వేలెత్తి చూపించడానికి కూడా అన్ని అంశాలు ఉన్నాయి. అలాంటి ఓ చేదు వాస్తవం... ప్రపంచ నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది మన దేశంలోనే ఉండడం. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఓ ఎన్‌జీవో చేసిన చిరు ప్రయత్నమే టీ కొట్టులో గ్రంథాలయం!
బెంగళూరులోని చిన్న వీధిలో టీ కొట్టు. దానికి ఓ వైపు ప్లాస్టిక్ అల్మారా వంటి దానిలో వేలాడుతున్న పుస్తకాలు. ఆ కొట్టు వద్దకు వచ్చిన స్థానికేతరుడు ఆ పుస్తకాల్లో ఒకటి నచ్చి...దానిని చేతిలోకి తీసుకుని, ఇదిగో టీతో పాటు ఈ పుస్తకం డబ్బులు అన్నాడు. ‘‘అవి అమ్మడానికి కాదండీ’’ టీ కొట్టు అతని సమాధానం. ‘‘అదేంటి షాపులో ఇలా వేలాడదీశావు.. అమ్మడానికి కాదంటావు’’?! అంటే, ‘‘అవునండీ.. అవి మా బస్తీ పిల్లలు చదువుకోవడానికి పెట్టినవి...’’ అంటూ పనిలో మునిగిపోయాడతను. ‘‘ఎంత మంచి మనసయ్యా నీది.. గుడ్ కీపిటప్’’ అంటూ అభినందించబోతే ‘‘ఆ అభినందన చేరాల్సింది నాకు కాదండీ’’ అన్నాడు!
ఇంతకీ అసలు విషయం ఏంటంటే జీవితంలో పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకేవీ తెలియని బస్తీపిల్లల్లో, బడి వదిలేసిన పిల్లల్లో ఆసక్తి పెంచడానికీ, వారికి విద్యను మరింత దగ్గర చేయడానికీ బెంగళూరుకు చెందిన అక్షర ఫౌండేషన్ చేసిన ప్రయత్నమది. ఈ ప్రయత్నానికి పెట్టిన పేరు ‘కటింగ్ టీ టేల్స్’. ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజు మొదలైన ఈ ప్రయత్నం కేవలం పాఠ్య పుస్తకాలను అందుబాటులో పెట్టడంతో అయిపోలేదు.
సాధారణంగా చిన్నపిల్లల బొమ్మలు, కథలు, వైజ్ఞానిక పుస్తకాలు కాస్త ఖరీదుగానే ఉంటాయి. ఒకవేళ తక్కువ ధరల్లో ఉన్నా కూడా ఆ ధరను కూడా భరించి కొనుక్కునేంత స్తోమత గానీ, అవగాహన గానీ పేద కుటుంబాల్లో ఉండదు. అందుకే అక్షర ఫౌండేషన్ పలువురు దాతల నుంచి సేకరించిన అలాంటి పుస్తకాలను తెచ్చి... ముందుకొచ్చిన కొందరు టీకొట్ల యజమానుల సాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అంటే ఆ టీకొట్టు యజమానే ఆ పుస్తకాలకు లైబ్రేరియన్. ‘‘వీటికోసం వచ్చి పిల్లలు ఆసక్తిగా తిరగేస్తుంటే చిత్రమైన అనుభూతి కలుగుతోంది. నిజంగా వారి ఆనందం చూస్తే నాక్కూడా ఎంతో సంతోషంగా ఉంటోంది’’ అని బైప్పనహళ్లిలోని సత్యనగర్ ప్రాంతంలో ‘కటింగ్ టీ టేల్స్’ కార్యక్రమానికి సహకరిస్తున్న టీకొట్టు యజమాని అన్నారు.
ఇక అక్షర వలంటీర్లు ఆదివారం అక్కడికి వెళ్లి ఆ పుస్తకాలలోని విశేషాలపై ఆటలు, క్విజ్‌లు కూడా నిర్వహించి పిల్లల ఆసక్తిని గమనిస్తున్నారు. ‘‘ఈ పుస్తకాలు చదువుతానని ఎపుడూ అనుకోలేదు, ఎందుకంటే మా నాన్న కూలీ. వీటిని కొనడానికి మా దగ్గర డబ్బుల్లేవు. నాకు భలే నచ్చాయి ఈ పుస్తకాలు. నాకిష్టమైన సుభాష్ చంద్రబోస్ గురించి మొత్తం ఉంది ఈ పుస్తకంలో’ అంటూ ఓ చిన్నారి వెలిగిపోతున్న మొహంతో ఆనందంగా చెప్పాడు. ప్రస్తుతానికి బెంగళూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటుచేశారు. భవిష్యత్తులో వీలైనన్ని చోట్ల, ఇతర నగరాల్లో కూడా ఏర్పాటుచేస్తాం అని అక్షర ప్రతినిధి బెనర్జీ చెప్పారు. థ్యాంక్స్ అక్షర, గుడ్ లక్ చిల్డ్రన్!!