పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో! | Potana old picture poet image! | Sakshi
Sakshi News home page

పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో!

Published Sun, Dec 28 2014 2:33 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో! - Sakshi

పోతన పోతబోసిన పద్యచిత్రమిదిగో!

అహములు సన్నములయ్యె
 దహనము హితమయ్యే దీర్ఘదశలయ్యె నిశల్,
 బహు శీతోపేతంబై
 ‘యుహు హుహు’ అని వడకె లోకముర్వీనాథా!

 

పద్యానవనం
మల్టీ మీడియా లేని రోజుల్లోనూ భావ వ్యక్తీకరణకు భాషను అద్భుత సాధనంగా వాడుకున్నారు ఒకప్పటి కవులు. అది కూడా, చంధోబద్దమైన పద్య రూపంలో అరమరికలు లేకుండా అటువంటి వ్యక్తీకరణ జరపడం విశేషం. తెలుగు భాషపై వారి సాధికారతకదొక చిహ్నం. భాషను ఉపకరణంగా వాడిని కవులంతా అంతటి ప్రతిభావంతులని చెప్పలేమేమో కాని, కొందరు మాత్రం భాషతో ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. చంధస్సు, వ్యాకరణ నియమాలేవీ వారి వ్యక్తీకరణకు ప్రతిబంధకాలు కాలేదు.
 
ఒక సన్నివేశాన్ని, ఓ సందర్భాన్ని, ఓ పరిస్థితిని యథాతథంగా కళ్లకు కట్టినట్టు వివరించడంలో దిట్ట బమ్మెర పోతన. అది కూడా అలతి అలతి పదాలతో, అతి తక్కువ మాటల్లో ఎంతో భావాన్ని నింపి పద్య విన్యాసం చేయించగలిగారాయన. శబ్ద పరంగా, అర్థపరంగా భాషపై సాధికారతే కాకుండా భావంపైన పూర్తి నియంత్రణ సాధించిన మహాకవి పోతన.
 
‘పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా?’ అన్న పద్యం నుంచి మొదలెడితే, శ్రీమద్భాగవతంలో ఆయన చెక్కిన అద్భుత పద్యశిల్పాలెన్నో! అయిదు వందల సంవత్సరాల తర్వాత నేటికి కూడా చెవుల్లో రింగుమనే, కంగుమనిపించే, గిలిగింతలు పెట్టే అత్యద్భుత పద్యరత్నాలకు లెక్కేలేదు. భక్తి, ఆధ్యాత్మిక భావనల్ని ప్రేరేపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా!  ఆబాలగోపాలాన్నీ రంజింపజేసిన యశోదకృష్ణం, రుక్మిణీకళ్యాణం, గజేంద్రమోక్షం, భక్తప్రహ్లాదం... ఇలా చెప్పుకుంటూ పోతే భాగవతమంతా చెప్పాల్సిందే!
 
అతిశయోక్తులు కూడా అతికినట్టు నిజమని భ్రమ కల్పించేంతటి సహజకవి పోతన. పోతన కావ్య సౌందర్య  గొప్పదనాన్ని వర్ణిస్తూ డా.సి.నారాయణరెడ్డి ఒక అతిశయోక్తి చెప్పినా ‘నిజమా!’ అన్న భ్రాంతి కలుగుతుందే తప్ప శంకించబుద్ధికాదు. సినారె రాసిన ‘మందారమకరందాలు’ విమర్శ  వ్యాసంలో, పోతనకు ఇంగ్లిష్ వచ్చేమో? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. గజేంద్ర మోక్ష ఘట్టంలో, ఎన్నో జన్మలనుంచి పూజిస్తున్న తాను, కష్టకాలమొచ్చి ఎంత మొరపెట్టుకున్నా విష్ణువు రాకపోతే, ‘లా(ఔఅగి)ఒక్కింతయు లేదు...’ అని గజేంద్రుడు విష్ణుమూర్తిని నిలదీశాడని పోతన రాశాడేమో? అన్న చమత్కార అన్వయం చెప్పారు.
 
ఇప్పుడంటే మల్టీమీడియా వచ్చింది. శబ్దం, దృశ్యం కలగలిసి ఏకకాలంలో వినగలిగి, చూడగలిగే అంటే చూపగలిగే మాద్యమాలొచ్చాయి. అప్పుడు లేవు. ఏం చెప్పినా, ఏం చూపించినా, ఏం వినిపించినా.... అన్నీ అక్షరాల్లోనే, ఆ తాటాకులపైనే! చెప్పదలచుకున్న వాడెవడూ వినదలచుకున్న, చదువదలచుకున్న వాడి దగ్గర అన్ని వేళలా ఉండడు, అదొక అసౌకర్యం. ఒకోసారి అది తరాల అంతరాల వ్యవహారం. దాన్ని అధిగమించడానికి పద్యంలోనే వర్ణచిత్రాల్ని శబ్దాలతో సహా ఆవిష్కరించాలి. పోతన అదే చేశాడు.

చలి కాలాన్ని ముచ్చటగా చెప్పాడు. పగటి సమయాలు నిడివి తగ్గి పొట్టిగా అయ్యాయట. రాత్రి సమయాలు సుదీర్ఘంగా సాగాయట. మంట కాచుకోవడం జనాలకి చాలా ప్రీతిపాత్రమయిందట. చలి చాలా తీవ్రమైపోయి లోకమంతా వణుకుతోందట. ఎలా వణుకుతోంది? గజగజమని చెప్పటం సహజం. కానీ ఇక్కడ పోతన, ఓ రాజా, లోకమంతా ‘యుహు హుహు’ అని వణుకుతోందని చెబుతాడు. చలికాలం రాగానే, వయసులతో నిమిత్తం లేకుండా దవడలు కదిలిస్తూ, యుహు హుహు అని శబ్దం చేస్తూ వణకని వారుండరేమో? మనం కొంచెం విశ్లేషిస్తే నాటి కవుల గొప్పదనం తేటతెల్లమవుతుంది. లోతుగా పరిశీలిస్తే మన తెలుగు గొప్పతనమది. తెలుగు భాషామతల్లీ! పది కాలాలు వర్ధిల్లు!
 - దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement