సాక్షి, సినిమా : దక్షిణ చలన చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ చిన్న చూపు వ్యవహారం కొత్తదేం కాదు. అయితే బాహుబలి రెండు భాగాల భారీ విజయం తర్వాత అది మరింత బయటపడింది. ఖాన్ త్రయం కూడా మన సినిమా విజయాన్ని అంగీకరించేందుకు తొలుత తటపటాయించారు కూడా. కమల్ ఆర్ ఖాన్ లాంటి వాళ్లు ఇక్కడి అగ్రహీరోలను చులకన చేయటం.. నిన్నగాక మొన్న హీనా ఖాన్ అనే సీరియల్ నటి బిగ్ బాస్ షోలో సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్లు.. ముఖ్యంగా తెలుగు అగ్రహీరోలపై పిచ్చి వ్యాఖ్యలు చేయటం చూశాం.
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ నిన్న దుబాయ్‌లో జరిగిన 2.0 చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చదవండి. ‘‘రజనీ సార్ నిజంగా అద్భుతం. ఆయన లాంటి లెజెండ్ పక్కన నటించే అవకాశం కల్పించిన దర్శకుడు శంకర్ కు ధన్యవాదాలు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం లభిస్తుందని అస్సలు ఊహించలేదు. 130 చిత్రాల్లో నటించిన నేను ప్రతీ సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. కానీ, 2.0తో మాత్రం చాలా నేర్చుకున్నానని గర్వంగా చెబుతున్నా’’ అని అక్షయ్ అన్నారు.
తానే కాదని, యావత్ బాలీవుడ్ రంగం దక్షిణ చిత్ర పరిశ్రమను చూసి చాలా నేర్చుకోవాలని అక్కీ చెప్పారు. ‘‘దక్షిణాది నటులు, నిపుణులు సినిమాలంటే ప్రాణం పెడతారు. చాలా కష్టపడతారు. సినిమా కోసం ఐక్యంగా కష్టపడతారు. ద్వేష, అసూయ లాంటివి వాళ్ల మధ్య అస్సలు కనిపించవు. పైగా ప్రతిభావంతులను భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తారు. అందుకే హిందీ పరిశ్రమ సౌత్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి’’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ లాంటి అగ్ర హీరోయిన్ కూడా వెంకీ, బాలయ్య పేర్లను ప్రస్తావిస్తూ.. చాలా మర్యాదస్తులని చెప్పింది. అంతేందుకు సాహోలో శ్రద్ధా కపూర్ కూడా ప్రభాస్ ఆతిథ్యం అదుర్స్ అంటూ పొడగ్తలతో ముంచెత్తింది. అలాంటప్పుడు ఇక్కడి సినిమాలతో నటించకుండా, ఎలాంటి అనుభవం లేకుండా చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment