నేనెప్పుడూ సామాన్యుడినే : ఏ.ఆర్.రెహమాన్
నేనెప్పుడూ సామాన్యుడినే : ఏ.ఆర్.రెహమాన్
Published Wed, Aug 28 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
న్యూఢిల్లీ: ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడమంటే ఏంటో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌ను చూస్తే తెలుస్తుంది. డబ్బు, కీర్తి తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని ఈ 48 ఏళ్ల సంగీత మాంత్రికుడు అంటున్నాడు. రెండు ఆస్కార్లతోపాటు గోల్డెన్‌గ్లోబ్, గ్రామీ అవ్డాలను భారత్‌కు తీసుకువచ్చిన ఘనతనూ రెహమాన్ సొంతం చే సుకున్నాడు. ‘నిజాయతీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో మనం ఏదైనా పనిచేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి కోసం అన్ని త్యాగం చేయగలిగిన వాళ్లకే విజయం దక్కుతుంది.
విజేతగా నిలబడాలంటే వినమ్రత చాలా అవసరం. డబ్బు, కీర్తిని తలకెక్కించుకోకూడదు. నేను ఎప్పుడూ సామాన్యుడినే. ఇక నుంచి కూడా అలాగే ఉంటాను’ అని రెహమాన్ వివరించాడు. 1992లో రోజా సినిమాతో సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించిన రెహమాన్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి సినిమాలోని ‘దిల్‌హై చోటా సా’, ‘యే హసీ వాదియా’ వంటి పాటలకు విశేష స్పందన రావడంతో ఇతడి కెరీర్ దూసుకుపోయింది. ఇటీవల రాంఝనాకు కూడా సంగీతం అందించడం తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అధిగమించినా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాడు.
‘నేను సంగీత సాధన చేస్తున్నకొద్దీ.. ఈ రంగంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. నాకంతా తెలుసని అనుకుంటే, మనం గతంలో చేసిందే మళ్లీ వస్తుంది. ప్రేక్షకులు ఎప్పుడూ తాజా సంగీతాన్నే కోరుకుంటారు. అందుకే నేను తరచూ ప్రయోగాలు చేస్తుంటాను’ అని రెహమాన్ వివరించాడు. ప్రస్తుతం మనోడు ‘రెహమాన్‌ఇష్క్’ పేరుతో వివిధ నగరాల్లో కచ్చేరీలు ఇస్తున్నాడు. ‘ప్రత్యక్షంగా నా అభిమానుల వద్దకు వెళ్లడానికి ఇదొక మంచి అవకాశం. వాళ్ల కళ్లలోకి చూస్తూ సంగీతాన్ని వినిపించడం మధురానుభూతి. ఇందులో కొత్త, పాత స్వరాలు మేళవించి సంగీతాన్ని వినిపిస్తాం. ఈ ప్రయత్నం శ్రోతలను ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నాం’ అని ఏఆర్ రెహమాన్ వివరించాడు.
Advertisement